రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్

రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్

లోకేశ్వరం, వెలుగు: రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రిన్సిపాల్​చితకబాదిన ఘటన లోకేశ్వరం మండల కేంద్రంలోని అమెరి కిడ్స్​పాఠశాలలో చోటుచేసుకుంది. బాధిత చిన్నారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. హద్గాం గ్రామానికి చెందిన సుమలత, సాయన్న దంపతుల కూతురు శృతిక, మరో విద్యార్థిని శుక్రవారం స్కూల్​లో గొడవ పడ్డారు. శృతిక డస్టర్​విసరడంతో ఆ పాప తలకు గాయమైంది. 

విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్​దివ్య శృతికను ఆఫీస్​రూమ్​కు తీసుకెళ్లి చితకబాదింది. తమ చిన్నారి వీపుపై వాతల పడి, రాత్రి జ్వరం వచ్చిందని సాయన్న తెలిపాడు. శనివారం ఎస్సై అశోక్ కుమార్, ఎంఈవో చంద్రకాంత్, తహసీల్దార్​భోజన్నకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఘటనపై ఎంఈవోను వివరణ కోరగా.. డీఈవో దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.