హైదరాబాద్​లో నీటి కొరత లేదు.. బోర్లు ఎండిపోవడంతోనే డిమాండ్ పెరిగింది

హైదరాబాద్​లో  నీటి కొరత లేదు.. బోర్లు ఎండిపోవడంతోనే డిమాండ్ పెరిగింది
  • జలాశయాల్లో సరిపడా నీళ్లున్నయ్: మున్సిపల్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ దాన కిశోర్
  • నాగార్జునసాగర్​లో ఉన్న నీళ్లే ఏడాదిపాటు ఇవ్వొచ్చు
  • సిటీకి రోజుకు 2,602 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరం
  • డిమాండ్ ఉన్న చోట ట్యాంకర్లతో సప్లై చేస్తున్నం
  • సమ్మర్ యాక్షన్ ప్లాన్​పై అధికారులతో రివ్యూ

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి కొరత లేదని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ స్పష్టం చేశారు. సిటీకి నీళ్లు సప్లై చేసే జలాశయాల్లో అవసరమైన మేరకు నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఒక నాగార్జునసాగర్​లో ఉన్న నీళ్లే హైదరాబాద్ సిటీకి ఏడాది పాటు సరిపోతాయన్నారు. పెరిగిన డిమాండ్​కు అనుగుణంగా వాటర్ సప్లై చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

సోమవారం మెట్రో వాటర్ బోర్డు ఆఫీస్​లో వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి, ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి దాన కిశోర్ సమ్మర్ యాక్షన్ ప్లాన్​పై సమీక్ష నిర్వహించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సిటీలోని కొన్ని ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతోనే నీళ్లకు డిమాండ్ పెరిగింది. నిరుడుతో పోలిస్తే ఈయేడు వాటర్ సప్లై 4.50 శాతం పెరిగింది. 

నీళ్ల డిమాండ్ ఎందుకు పెరిగిందన్న దానిపై ఇప్పటికే నగరంలోని 1,700 ఇండ్లు, అపార్ట్​మెంట్లలో అధికారులతో సర్వే చేయించాం. బోర్లు ఎండిపోవడమే దీనికి కారణమని తేలింది. నల్లాల ద్వారా వచ్చే నీళ్లు సరిపోకపోవడంతో ట్యాంకర్ల కోసం ఆర్డర్లు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో నీటి ఎద్దడి రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం’’అని వివరించారు.

మరికొన్ని ట్యాంకర్లు అందుబాటులోకి తెస్తం

గ్రేటర్ పరిధిలో మరికొన్ని ట్యాంకర్లను అందుబాటులోకి తెస్తున్నామని దాన కిశోర్ తెలిపారు. సిటీలో ప్రస్తుతం 706 ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయని, రోజుకు 7,772 ట్రిప్స్ వేస్తుంటాయని చెప్పారు. వేసవి వెళ్లే దాకా 12వేల ట్రిప్పులు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ‘‘ఆర్టీఏ నుంచి కొన్ని వెహికల్స్ తీసుకుని వాటికి ట్యాంకర్లను బిగించి వాటర్​ సప్లై చేస్తాం. ఇప్పటి దాకా 300 ట్యాంకర్ల తయారీకి ఆర్డర్ ఇచ్చాం. వారానికి 50 నుంచి 60 ట్యాంకర్లు అందుబాటులోకి వస్తాయి. రూ.50 కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించాం’’అని తెలిపారు. 

పడిపోయిన గ్రౌండ్ వాటర్ లెవల్స్

మణికొండ, కూకట్​పల్లి, జూబ్లీహిల్స్, ఎస్ఆర్​నగర్ తదితర ప్రాంతాల్లోని 1,700 ఇండ్లలో సర్వే చేస్తే గ్రౌండ్ వాటర్ తగ్గినట్టు గుర్తించామని దాన కిశోర్ తెలిపారు. ‘‘65 శాతం బోర్లు ఎండిపోయాయి. 15 శాతం బోర్లలో నీళ్లు తక్కువ వస్తున్నాయి. సిటీకి పశ్చిమ వైపు భారీ భవనాలు వెలిశాయి. దీంతో గ్రౌండ్ వాటర్ లెవల్స్ తగ్గిపోయాయి. ఇంకుడు గుంతల నిర్మాణం, రూఫ్​టాప్ హార్వెస్టింగ్​పై అవగాహన కల్పిస్తున్నాం. ట్యాంకర్ బుక్ చేసుకున్న వారికి సకాలంలో నీళ్లు సప్లై అయ్యేలా చర్యలు తీసుకోవాలి. సిటీలో 78 ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. కొత్తగా మరో 22 ఫిల్లింగ్ స్టేషన్​లను అందుబాటులోకి తీసుకొస్తాం. నిరుడు మార్చిలో రోజుకు 21 వేల కస్టమర్లు ట్యాంకర్ల ద్వారా నీళ్లు అడిగితే.. ఇప్పుడు 31 వేలకు పెరిగింది’’అని తెలిపారు.

నాగార్జునసాగర్​లో 133 టీఎంసీల నీళ్లున్నయ్

ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలు, కాలనీలకు కూడా తాగునీరు అందించేందుకు మెట్రో వాటర్ బోర్డు కృషి చేస్తున్నదని దాన కిశోర్ తెలిపారు. ‘‘సింగూరు, మంజీరా, ఎల్లంపల్లి, నాగార్జునసాగర్, ఉస్మాన్​సాగర్, హిమాయత్​ సాగర్​ నుంచి రోజుకు 2,602.29 మిలియన్ లీటర్ల నీటిని వాడుకుంటున్నాం. ఇందులో హైదరాబాద్ కోర్ సిటీకి 1,098 మిలియన్ లీటర్లు, శివారు ప్రాంతాలకు 1,0‌‌‌‌‌‌‌‌84.44 మిలియన్ లీటర్లు, ఓఆర్ఆర్ ఏరియాలకు 270 మిలియన్ లీటర్లు, మిషన్ భగీరథకు 149.19 మిలియన్ లీటర్లను అందిస్తున్నాం. 

నాగార్జునసాగర్​లో ప్రస్తుతం 133.71 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. డెడ్ స్టోరేజీకి వెళ్లినా 131 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయి. వేసవి వెళ్లే వరకు హైదరాబాద్ సిటీకి 5.60 టీఎంసీల నీళ్లు మాత్రమే అవసరం అవుతాయి. వారం రోజుల్లోనే నాగార్జునసాగర్ నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ కూడా ప్రారంభం అవుతుంది’’అని తెలిపారు. ఎల్లంపల్లి రిజర్వాయర్​లో 5 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, ఈ వేసవి మొత్తానికి ఇందులోంచి 3.33 టీఎంసీలు సరిపోతాయని చెప్పారు. హిమాయత్​సాగర్, ఉస్మాన్​సాగర్​లో మూడు టీఎంసీలు ఉన్నాయన్నారు.