యువశక్తే దేశానికి సంపద

యువశక్తే దేశానికి సంపద

జనాభాలో భారత దేశం చైనాను అధిగమించి, ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరించింది. భారత దేశ జనాభా మరికొన్ని సంవత్సరాలు ఇలాగే పెరుగుతూ తగ్గు ముఖం పట్టవచ్చని ఒక అంచనా. జనాభా నియంత్రణ కోసం చైనా చేపట్టిన ‘వన్ చైల్డ్’ విధానం బెడిసి కొట్టి, వృద్ధుల సంఖ్య పెరిగింది. ఏ దేశ ప్రగతి కైనా యువత ఒక వరం. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన చైనా గత విధానాలను సవరించుకుని, ఎక్కువ మంది పిల్లలను కనడానికి ఆస్కారం కలిగించింది. భారతదేశంలో యువతకు కొదవలేదు. భారతీయ యువతకు ప్రపంచంలో  ఒక విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత దేశ యువతలో కష్టించే తత్వం అధికం. మన యువతలో అన్ని రంగాల్లో నైపుణ్యతను పెంచగలిగితే  జాతి పురోభివృద్ధి శరవేగంగా దూసుకుపోగలదు. ఇందుకు తగిన కృషి చేయాలి. ఉన్నత స్థాయిలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలను అందించాలి.

యువతకు ప్రాధాన్యం పెరగాలి

మానవ వనరుల్లో సింహభాగం యువతకు స్వంతం. అలాంటి యువతకు సాంఘిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో అర్ధవంతమైన భాగస్వామ్యం లేకపోతే ప్రపంచం ముందుకు సాగలేదు. స్వార్ధంతో, అవినీతితో, యుద్ధోన్మాదంతో, హింసతో, అంటువ్యాధులతో అస్తవ్యస్తంగా తయారైన ప్రపంచాన్ని పునర్నిర్మించవలసిన తరుణం ఆసన్నమైనది. మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే యువశక్తి పైనే  ఆధారపడి ఉంది. ఏ దేశ మనుగడైనా, అభివృద్ధి అయినా ఆ దేశంలోని యువత రూపంలో నిక్షిప్తమైన మానవ వనరులపైనే ఆధారపడి ఉంటుంది. యువత సక్రమ పంథాలో పయనించినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రగతికి, శాంతి, సుస్థిరతలకు పట్టుగొమ్మలు యువతీ యువకులు. యువత ఆలోచనలు సమాజ నిర్మాణానికి తోడ్పాటును అందించగలవు. యువశక్తిని సక్రమంగా  వినియోగించే  ప్రణాళికలు రూపొందించాలి. యవ్వనం  నిర్ధిష్ట లక్ష్యాలతో ఆలోచనా భరితంగా ఉండాలే కాని ఆవేశ పూరితంగా ఉండరాదు.  సకారాత్మక దృక్పథంతో యువత ఆలోచనలు వికసించాలి. ఉన్నత లక్ష్యాల సాధనకు వినియోగించుకోవాలి. 

దురలవాట్ల నుంచి విముక్తి కల్పించాలి

మానవ జీవితంలో ఏదైనా సాధించాలన్నా 25–-30  సంవత్సరాల ప్రాయం అత్యంత కీలకమైనది. యువత మద్యం, మాదకద్రవ్యాలకు లోను కావడం, విశృంఖల లైంగిక వాంఛల కోసం, విలాసాలకోసం అనైతికమైన పద్దతుల్లోకి నెట్టబడడం, అసాంఘిక కార్యకలాపాల వైపు ప్రేరేపించబడడం వలన యువశక్తి నిర్వీర్యమై, విధ్వంస కార్యకలాపాలకు వెన్నుదన్నుగా మారుతున్నది. నిర్మాణాత్మకంగా ఉపయోగపడవలసిన యువత  దురలవాట్లకు లోనై, సమాజానికి భారంగా మారడం దురదృష్టకరం.  ఇలాంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి. వ్యసనాల్లో యువతరం తేలియాడితే ఏ దేశ గతి అయినా, ప్రగతి అయినా అధోగతే. యువత ఆలోచనలు సక్రమదిశలో సాగాలి. పరిపక్వతతో యోచన చేయాలి. దూరదృష్టితో  తమ లక్ష్యాలను నిర్ధేశించుకుని ముందుకు సాగాలి. యువత సమస్యలను పరిష్కరించడం, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై యువతకు అవగాహన కలిగించి, దేశ నిర్మాణం వైపు యువతను కార్యోన్ముఖులను చేయాలి.  పోరాడే బాధ్యతలను అప్పగించాలి. ప్రత్యక్ష భాగస్వామం కల్పించాలి. న్యాయ సంబంధమైన, సామాజిక, ఆర్ధిక, రాజకీయ సంబంధమైన అంశాల్లో అవగాహన కల్పించడంతో పాటు దేశ పురోగమనం వైపు పయనించే విధంగా మార్గనిర్ధేశనం చేయాలి.  దురలవాట్లకు సంబంధించిన ఉత్పత్తులను దేశంలో పూర్తిగా నిషేధించే ప్రయత్నం మన పాలకులు చేయాలి.

అధిక జనాభాలో యువతే అధికం

ప్రగతికి బాటలు వేయాలి. నైపుణ్యం కొరవడిన విద్యార్ధుల చదువులు, వ్యక్తిత్వం, వికాసంపై మన విద్యావిధానం దృష్టి సారించాలి.  యువశక్తి సకారాత్మకంగా స్పందించాలి. దేశాభ్యున్నతి కోసం తపించాలి. అనాదిగా వస్తున్న భారతీయ విలువలను కాపాడుకుంటూ ప్రపంచంలో భారతదేశ ఖ్యాతిని ఇనుమడింప చేయాలి. ప్రపంచ జనాభాలో మొదటి ర్యాంకు సాధించిన భారత్​లో యువకుల జనాభానే అత్యధికం.  ప్రపంచంలో ఏదేశంలోనూ లేనంత యువతను కలిగి ఉండడమే మన దేశ భాగ్యమని చెప్పొచ్చు. ఆ యువత ద్వారానే భారత్​ను సర్వ సంపన్న దేశంగా ప్రపంచంలో నెలబెట్టవచ్చు. దేశ జనాభా బాగా పెరిగిందనే బాధ అక్కరలేదు.  దేశంలో యువ జనాభా అధికంగా ఉండడమే ఈ దేశ సౌభాగ్యం.

సుంకవల్లి సత్తిరాజు