
పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘సర్జమీన్’. కాజోల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంతో నటుడు బోమన్ ఇరానీ కొడుకు కాయోజ్ ఇరానీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దేశభక్తి కథాంశంతో కశ్మీర్ ఉగ్రవాదం నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో ఆర్మీ ఆఫీసర్‌గా నటించాడు పృథ్విరాజ్ సుకుమారన్. అతని భార్య మీరా పాత్రలో కాజోల్, కొడుకు హర్మన్ పాత్రలో ఇబ్రహీం నటించారు. ఓవైపు ఉగ్రవాదుల నుండి దేశాన్ని రక్షిస్తూ, మరోవైపు తన కొడుకు సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేసే తండ్రిగా పృథ్విరాజ్ కనిపించాడు.
అలాంటి ఆర్మీ ఆఫీసర్ కొడుకైన హర్మన్ తన తండ్రిని వ్యతిరేకిస్తూ టెర్రరిస్ట్‌గా ఎందుకు మారాడు అనే అంశాలతో కట్ చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఓ వైపు భార్యగా, మరోవైపు తల్లిగా ఎమోషనల్ టచ్ ఉన్న క్యారెక్టర్‌లో కాజోల్ కనిపించారు. మాతృభూమిని కాపాడటం కంటే ముఖ్యమైనది మరొకటి లేదని భావించే ఆర్మీ ఆఫీసర్.. శత్రువు స్థానంలో ఉన్న కొడుకు విషయంలో ఏం చేశాడు అనేది మూవీ మెయిన్ కాన్సెప్ట్. వార్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. జియో హాట్ స్టార్‌లో ఈనెల 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.