బ్రాండెడ్​కు, జనరిక్​కు ధరల్లో భారీ తేడా

బ్రాండెడ్​కు, జనరిక్​కు ధరల్లో భారీ తేడా
  • జనరిక్​ షాపులు వెలవెల
  • అవగాహన లేక మోసపోతున్న రోగులు
  • ప్రైవేటు హాస్పిటల్స్ మెడిసిన్ దందా

పెద్దపల్లి, వెలుగు: ప్రైవేటు డాక్టర్లు బ్రాండెడ్ మందుల పేరుతో రోగులను నిండా ముంచుతున్నారు. మందుల కంపెనీలతో కుమ్మక్కై పర్సెంటేజీల కోసం బ్రాండెడ్ మందులను ప్రిఫర్ చేస్తున్నారు. జనరిక్ మందులపై రోగులకు అవగాహన కల్పించి వాటిని వాడేలా చూడాల్సిన డాక్టర్లు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వం జిల్లా కేంద్రానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన జనరిక్ మందుల షాపులు కూడా మూతపడుతున్నాయి. ఎలాంటి రోగానికైనా డాక్టర్లు బ్రాండెడ్ మందులను రాసి రోగులు ఆర్థికంగా దోపిడీకి గురయ్యేలా చేస్తున్నారు. జనరిక్ మందులకు, బ్రాండెడ్ మందుల ధరలో తేడా దాదాపు 100 నుంచి 200 శాతం వరకు ఉంటుంది. 

భారీగా కమిషన్..
రోగుల నుంచి తమ మందులు కొనిపిస్తే ఆ డాక్టర్​కు ఫార్మా కంపెనీల నుంచి సుమారు 30 శాతం దాకా కమిషన్ ఇస్తున్నట్లు తెలిసింది. అందువల్ల నర్సింగ్ హోం, ప్రైవేటు క్లినిక్​లు, కార్పొరేట్ ఆస్పత్రుల డాక్టర్లు బ్రాండెడ్ మందులే ప్రిఫర్ చేస్తున్నారు. దీనిపై గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) చాలా సార్లు పలు గైడ్​ లైన్స్ ఇవ్వడంతోపాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది. బ్రాండెడ్ మందుల ప్లేసులో జనరిక్ మందులు రాయాలని, మందుల చిట్టీలో విడిగా అక్షరాలు రాయాలని ఎంసీఐ సూచించింది. అయినా ప్రైవేటు వైద్యుల తీరు మారలేదు. 

జనరిక్ అంటే..?
ఏదైనా ఒక కంపెనీ కొత్త మందును కనుక్కొని క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి మార్కెట్లోకి తీసుకొస్తే ఆ మెడిసిన్ మీద ఆ కంపెనీ బ్రాండ్ వేస్తుంది. ఈ మందుపై ఆ కంపెనీకి 10 సంవత్సరాల పేటెంట్ ఉంటుంది. పేటెంట్ గడువు ముగిసిన తర్వాత ఆ మందును ఎవరైనా తయారు చేయవచ్చు. వీటినే జనరిక్ మందులు అంటారు. బ్రాండ్ ఇమేజ్ అవసరం లేదు. కాబట్టి తయారీ వ్యయం తక్కువ. తయారీలోనూ తేడా ఉండదు. ధరలో మాత్రం భారీ తేడా ఉంటుంది. అందువల్ల జనరిక్ మందులు తక్కువ ధరకే దొరుకుతాయి. బ్రాండెడ్ మందులకు జనరిక్ మందులకు ధరలోనే తేడా. ఫార్ములా మొత్తం ఒకటే ఉంటుంది. ఉదాహరణకు క్రోసిన్ అంటే బ్రాండెడ్ పేరు, అదే జనరిక్ అంటే పారసిటమల్ అని రాయాలి. అలాగే నోవామాక్స్ అనేది బ్రాండెడ్ పేరు కాగా, అమాక్సిలిన్ అనేది జనరిక్ మందుపేరు. అలాగే అజిరైట్ అనేది బ్రాండెడ్ పేరు దాని జనరిక్ పేరు అజిత్రోమైసిన్ అని రాయాల్సి ఉన్న పట్టించుకోవడం లేదు.

బ్రాండెడ్, జనరిక్ మందుల రేట్లలో తేడా (100 టాబ్లెట్స్​)
మెడిసిన్                  క్వాంటిటీ     బ్రాండెడ్ ధర     జనరిక్ ధర
సిఫిగ్జిమ్                   200 ఎంజీ     రూ. 1250            రూ. 450
సిట్రిజన్                  10 ఎంజీ       రూ. 250              రూ.20
మల్టీ విటమిన్        100 పిల్స్     రూ. 1000            రూ. 300
పారసిటమల్          500 ఎంజీ    రూ. 130              రూ. 30
మెట్ఫార్మిన్            150  ఎంజీ    రూ. 200              రూ. 30    

 ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం
జనరిక్ మందుల గురించి ప్రజల్లో అవగాహహన కల్పిస్తున్నాం. జనరిక్ మందులే రాయమని అడిగేలా రోగులకు మందులపై నమ్మకాన్ని కలిగించేలా చూస్తాం. బ్రాండెడ్ మందులు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉన్నందున డాక్టర్లు ఎక్కువగా వాటిని సూచిస్తున్నారు. వాస్తవానికి ఎక్కువగా జనరిక్ మెడిసిన్స్ ప్రిఫర్ చేయాల్సిన అవసరముంది. అయితే జనరిక్ రేటు తక్కువ ఉండటంతో పనితీరుపై ప్రజల్లో అపనమ్మకం ఉంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాం.
- డాక్టర్ ప్రమోద్​కుమార్, డీఎంహెచ్ఓ, పెద్దపల్లి