డెంగ్యూ పేరిట దోచేస్తున్నరు..ఉమ్మడి జిల్లాలో భారీగా నమోదవుతున్న కేసులు

డెంగ్యూ పేరిట దోచేస్తున్నరు..ఉమ్మడి జిల్లాలో భారీగా నమోదవుతున్న కేసులు
  • ప్లేట్ లెట్స్ పేరిట బ్లడ్ బ్యాంకుల దోపిడీ 
  • విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ హాస్పిటళ్లు

కరీంనగర్/జగిత్యాల, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెంగ్యూ ట్రీట్ మెంట్ పేరిట ప్రైవేట్ హాస్పిటల్స్, ప్లేట్ లెట్స్ పేరిట బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు దోపిడీ చేస్తున్నరు. గ్రామాల్లో, పట్టణాల్లో శానిటేషన్ సరిగ్గా లేక విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పేషెంట్లలో ప్లేట్‌‌‌‌లెట్స్ తగ్గుతుండడంతో ఇదే అదనుగా వసూళ్లకు తెగబడుతున్నారు. వైరల్ ఫీవర్లను కూడా డెంగ్యూ అని చెప్పి భయబ్రాంతులకు గురిచేస్తూ రోగుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు చెప్తుండడంతో పేషెంట్ల కుటుంబ సభ్యులు కూడా అడిగినంత ముట్టచెబుతున్నారు.  వైద్య, ఆరోగ్య శాఖాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే  ప్రైవేట్ హాస్పిటల్స్, బ్లడ్ బ్యాంకుల దోపిడీ అడ్డూఅదుపులేకుండా పోయింది.  

వందల్లో డెంగ్యూ బాధితులు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డెంగ్యూ కేసుల సంఖ్య రెండు నెలల్లో విపరీతంగా పెరిగింది. కరీంనగర్ టీ డయాగ్నస్టిక్ సెంటర్ రిపోర్టు ప్రకారం.. ఆగస్టు నెలలో 125 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. ఈ నెలలో 145  మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లు తేలింది.  ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు డెంగ్యూ కేసుల సంఖ్య 400 దాటిందని అంచనా. కాగా జిల్లా వైద్యాధికారులు మాత్రం డెంగ్యూతో ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదని చెప్తున్నారు. 
 
 పెద్దపల్లి జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 152 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇందులో నెల రోజుల్లోనే 61 డెంగీ మైల్డ్ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ అధికారులు చెప్తున్నారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని టీ హబ్ డయాగ్నస్టిక్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో జ్వర పీడితులకు టెస్టులు చేస్తున్నారు. మైల్డ్ పాజిటివ్ వచ్చినా పెద్దపల్లి ఆస్పత్రితో పాటు పీహెచ్‌‌‌‌సీల్లో ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. అలాగే డెంగ్యూ తీవ్రత ఉన్న వారిని కరీంనగర్ ఆస్పత్రితోపాటు హైదరాబాద్ గాంధీకి రిఫర్ చేస్తున్నారు.

ALSO READ: వనపర్తి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న బాధితులు
  
 జగిత్యాల జిల్లాలో  ఇప్పటి వరకు 100 డెంగ్యూ  కేసుల రికార్డు అయినట్లు  మెడికల్ ఆఫీసర్లు వెల్లడించారు. కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.  ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎలిసా టెస్టు ద్వారా మాత్రమే డెంగ్యూ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ప్రైవేట్ హాస్పిటల్స్ లో మాత్రం ర్యాపిడ్ టెస్ట్ ల ద్వారా డెంగ్యూను నిర్ధారిస్తున్నారు. ఇవి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావడం లేదు. ఇలాంటి పాజిటివ్ కేసుల లెక్క 350కిపైగా ఉంటాయని అంచనా. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్‌‌‌‌మెంట్ ​తీసుకుంటున్నవారి సంఖ్యతో సర్కార్ లెక్కలతో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు అదనంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా సర్కార్ ఆస్పత్రుల్లో ప్లేట్ లేట్స్ సపరేటర్ మిషన్, సింగిల్ డోనర్ మిషన్ (ఎస్‌‌‌‌డీపీ) అందుబాటులో లేవు. దీంతో రోగులు ప్రైవేట్ కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 
   
రాజన్నసిరిసిల్ల జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 8 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలో ఉన్న టీ హబ్ డయాగ్నస్టిక్​లో 5,944 డెంగ్యూ టెస్ట్ లు చేయగా 8 కేసులు పాజిటివ్ గా తేలడంతో ట్రీట్ మెంట్ చేశారు. 

ప్రైవేట్ దోపిడీపై చర్యలేవి..?

డెంగ్యూ, వైరల్ ఫీవర్ వచ్చిన రోగుల నుంచి ట్రీట్‌‌‌‌మెంట్ పేరుతో రూ.లక్షల్లో వసూల్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ లో ర్యాపిడ్ పద్ధతిలో టెస్ట్ కిట్ వాడుతూ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఎలిసా టెస్ట్ మినహా ఎలాంటి ర్యాపిడ్ డెంగ్యూ టెస్ట్ లెక్కలోకి తీసుకోమని హెల్త్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు చెప్తుండగా.. ప్రైవేట్‌‌‌‌లో ఈ టెస్టుల పేరిట రూ.లక్షల్లో దందా నడుస్తున్నా కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సర్కార్ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టి, అధిక వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ ఆస్పతులపై చర్యలు తీసుకోవాలని రోగుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

‘ఈ ఫొటోలో  కనిపిస్తున్న మహిళ వెల్గటూర్ మండలం కోటి లింగాలకు చెందిన దాసరి శాంతమ్మ. వారం రోజుల కింద వైరల్ ఫీవర్ రావడంతో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మూడు రోజుల కింద చేరింది. వైద్యులు టెస్ట్ చేసి డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారించారు. సదరు పేషెంట్‌‌‌‌కు ప్లేట్‌‌‌‌లెట్స్​ తక్కువ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్ కు వెళ్లగా ప్లేట్‌‌‌‌లెట్​సపరేటర్ లేదని చెప్పడంతో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకును ఆశ్రయించారు. ప్లేట్‌‌‌‌లెట్స్‌‌‌‌ ప్యాకెట్ కు రూ.11 వేలు తీసుకోవాల్సి ఉండగా వీళ్ల అవసరాన్ని ఆసరాగా తీసుకొని నిర్వాహకులు రూ.13 వేలు వసూలు చేశారు. ’