
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఫరూఖాబాద్ జిల్లా మొహమ్మదాబాద్ ఎయిర్ పోర్ట్. ఇక్కడ జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. 2025, అక్టోబర్ 9వ తేదీ ఉదయం ఎయిర్ పోర్టులో ఓ ప్రైవేట్ జెట్ విమానం.. రన్ వే నుంచి జారిపోయింది. ఎయిర్ పోర్ట్ గోడను ఢీకొని ఆగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రైవేట్ జెట్ లో ఇద్దరు పైలట్లు, ఐదుగురు ప్రముఖ వ్యక్తులు ఉండటం విశేషం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖిమ్షేపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో బీర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది ఉడ్ పెకర్ గ్రీన్ అగ్రి న్యూట్రిప్యాడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ బీర్ ఫ్యాక్టరీకి ఎండీ అజయ్ అరోరా. ఫ్యాక్టరీ ఏర్పాటుకు కావాల్సిన వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు.. మోహమ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తన బోర్డు సభ్యులతోపాటు SBI.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారి సుమిత్ శర్మతో కలిసి బయలుదేశారు.
ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో ప్రైవేట్ జెట్ అదుపుతప్పింది. పైకి ఎగరాల్సిన ప్రైవేట్ జెట్ విమానం.. అదుపుతప్పి రన్ వే పైనుంచి పక్కకు వెళ్లిపోయింది. ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడను ఢీకొని ఇగిపోయింది. ఈ ప్రమాదంలో బీర్ ఫ్యాక్టరీ ఎండీ అరోరా, స్టేట్ బ్యాంక్ ఉన్నతాధికారి సుమిత్ శర్మతోపాటు ఇతర బోర్డు సభ్యులు, ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రైవేట్ జెట్ మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నది.
ఈ ఘటనపై విమానయాన శాఖ విచారణ చేపట్టింది. ప్రమాదానికి కారణాలు ఏంటీ అనేది స్థానిక ఎయిర్ పోర్ట్ అథారిటీ నుంచి వివరాలు సేకరిస్తుంది.