నోటీసులా? వీ డోంట్ కేర్!..కాళోజీ వర్సిటీ నోటీసులను సైతం లెక్క చేయని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు

నోటీసులా? వీ డోంట్ కేర్!..కాళోజీ వర్సిటీ నోటీసులను సైతం లెక్క చేయని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు
  • ఇంటర్న్​షిప్ ఫీజులు, 5 ఏండ్ల ఫీజుల పేరిట అడ్డగోలు దోపిడీ 
  • అకడమిక్ ఫీజులు తప్ప.. అదనపు ఫీజులు వసూలు చేయొద్దన్న ఎన్ఎంసీ రూల్స్ బ్రేక్
  • టీఏఎఫ్ఆర్‌‌సీ నిబంధనలకు విరుద్దంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 

హైదరాబాద్, వెలుగు: ‘‘మేం చెప్పిందే శాసనం.. మా నిబంధనలే ఫైనల్’’ అన్నట్లుగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వ్యవహరిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు, అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (కేఎన్ఆర్యూహెచ్ఎస్)ని ఎన్నిసార్లు హెచ్చరించినా, సర్క్యూలర్లు జారీ చేసినా యాజమాన్యాల్లో మార్పు రాలేదు. నాలుగున్నరేండ్ల ఎంబీబీఎస్ చుదువుకు ఐదేండ్ల ఫీజులు వసూలు చేయడంతో పాటు, ఇంటర్న్ షిప్ నకూ స్పెషల్ ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది.  

ఫీజులు చెల్లిస్తేనే..  అనుమతిస్తామని తెగేసి చెప్తున్నాయి. దీంతో కోటి ఆశలతో డాక్టర్ అవుదామని వచ్చిన పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. నాలుగున్నరేండ్ల కాలానికే ఫీజులు వసూలు చేయాలని, ఇంటర్న్ షిప్ కోసం ప్రత్యేకంగా ఫీజులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని వర్సిటీ నోటీసులు జారీ చేస్తున్నా లెక్కచేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. 

ఇంటర్న్ షిప్ ఫీజుగా స్టైపెండ్ ఇవ్వాలని ఒత్తిడి.. 

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రూల్స్ ప్రకారం అకడమిక్ ఫీజులు తప్ప అదనపు ఫీజులు వసూలు చేయకూడదు. కానీ, ప్రైవేట్ యాజమాన్యాలు మాత్రం ఇంటర్న్‌‌షిప్ (సీఆర్ఆర్ఐ) కాలానికి కూడా విడిగా ఫీజులు డిమాండ్ చేస్తున్నాయి. ఇంటర్న్ షిప్ చదువు అయ్యాక.. విద్యార్థులు సర్వీస్ చేస్తారు. దానికి కాలేజీలు స్టైపెండ్ చెల్లిస్తుంది. అయితే, తాము ఇచ్చే స్టైఫెండ్‌‌ నే తిరిగి తమకే ఇంటర్న్ షిప్ ఫీజుగా చెల్లించాలని బలవంతం చేస్తుండటం గమనార్హం. అలాగే, ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి నాలుగున్నర ఏళ్లు మాత్రమే.

ఈ కాలానికి సంబంధించిన ఫీజును విద్యార్థుల వెసులుబాటు కోసం ఐదు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంటే మొత్తం కోర్సు ఫీజును ఐదు భాగాలుగా చేసి ఏటా కొంత వసూలు చేయాలి. కానీ, చాలా కాలేజీలు ఐదో ఏడాది కూడా పూర్తి స్థాయి ఫీజు కట్టాలని విద్యార్థులను వేధిస్తున్నాయి. ఇవే కాకుండా ల్యాబ్, లైబ్రరీ, డెవలప్‌‌మెంట్ చార్జీల పేరిట లక్షలాది రూపాయలు అదనంగా దండుకుంటున్నాయి.

వ్యవస్థల మధ్య సమన్వయ లోపం... 

వ్యవస్థల మధ్య సమన్వయ లోపం ప్రైవేట్ కాలేజీలకు వరంగా మారింది. ఎన్ఎంసీ మార్గదర్శకాలు ఇస్తున్నా, టీఏఎఫ్ఆర్‌‌సీ ఫీజులు నిర్ణయిస్తున్నా, కాళోజీ వర్సిటీ నోటీసులు ఇస్తున్నా.. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు తీరు మార్చుకోవడం లేదు. వర్సిటీకి కంప్లైంట్ చేస్తే... నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని కాలేజీలపై కంప్లైంట్ చేసినప్పటికీ.. అధికారులు కాలేజీల పేర్లు మెన్షన్ చేయకుండా.. జనరల్ గా అన్ని కాలేజీలకు సర్క్యూలర్లు జారీ చేస్తున్నారని, దీంతో తప్పు చేస్తున్న కాలేజీల పేర్లు బయటకు రావడం లేదని చెబుతున్నారు.

 మరోవైపు.. కాలేజీలపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని, ఎన్ఎంసీకే ఉందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఎన్ఎంసీ కూడా వర్సిటీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించక.. సంవత్సరాలు అయింది. వ్యవస్థల మధ్య సమన్వయలోపం.. ప్రైవేట్ మెడికల్ కాలేజీల పాలిట వరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని, నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

చెబితే వినకపోతే.. ఎన్ఎంసీకి ఫిర్యాదు చేస్తం 

వర్సిటీ పరిధిలో ఉన్నంత వరకు చర్యలు తీసుకుంటున్నం. మెజారిటీ కాలేజీలు నాలుగున్ననరేండ్లకే ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇటీవలే కొన్నికాలేజీలపై ఇంటర్న్ షిప్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.  అలా వసూలు చేయొద్దని సర్క్యూలర్ జారీ చేశాం. చెబితే వినకపోతే ఆయా కాలేజీలపై ఎన్ఎంసీకి కంప్లైంట్ చేస్తం. రూల్స్ బ్రేక్ చేసిన కాలేజీల సీట్లు తగ్గించాలా, డీఅఫ్లియేషన్ చేయాలా అనేది ఎన్ఎంసీ పరిధిలో అంశం. - రమేశ్​రెడ్డి, వీసీ, కాళోజీ వర్సిటీ

పేరెంట్స్ పై రూ. 200 కోట్ల భారం

ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అదనంగా వసూలు చేయడం వల్ల  పేరెంట్స్ పై సమారు రూ. 200 కోట్ల భారం పడుతుంది. వర్సిటీ అధికారులు వ్యక్తిగతంగా కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. కంప్లైంట్స్ చేసినా..  నోటీసులు ఇచ్చి సైలెంట్ అయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి.   - మల్లోజు సత్యనారాయణ చారి, మెడికో పేరెంట్స్ అసోషియేషన్