స్టూడెంట్లకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు

స్టూడెంట్లకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు
  • అదనంగా వసూలు చేస్తున్న ప్రైవేటు మెడికల్ కాలేజీలు
  • కాలేజీని బట్టి రూ.30 వేల నుంచి రూ.1.35 లక్షల దాకా గుంజుతున్నరు 
  • ల్యాబ్, లైబ్రరీ ఫీజు పేరిట స్టూడెంట్ల నుంచి దోపిడీ
  • నిబంధనలకు విరుద్ధంగా డీడీల మిస్‌‌‌‌ యూజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు స్టూడెంట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. నీట్‌‌‌‌లో మంచి ర్యాంక్‌‌‌‌ తెచ్చుకుని కన్వీనర్ కోటా సీటు సాధించిన స్టూడెంట్లకు కూడా ఎంబీబీఎస్ ఫీజుల మోత తప్పడం లేదు. ల్యాబ్ ఫీజు, లైబ్రరీ ఫీజు పేరిట రూ.50 వేల నుంచి లక్ష వరకూ అదనంగా వసూలు చేస్తున్నారని స్టూడెంట్స్‌‌‌‌ చెప్తున్నారు. కన్వీనర్ కోటా స్టూడెంట్లనే కాదు.. లక్షల్లో ఫీజు కట్టే మేనేజ్‌‌‌‌మెంట్ కోటా స్టూడెంట్ల వద్దా అదనపు ఫీజులు వసూలు దండుకుంటున్నారు. ఇలా తీసుకున్న డబ్బులకు రసీదు కూడా ఇవ్వట్లేదని స్టూడెంట్ల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఖమ్మంలోని ఓ కాలేజీలో అదనంగా రూ.45 వేలు కట్టించుకోగా, హైదరాబాద్‌‌‌‌లోని ఓ మంత్రికి చెందిన కాలేజీలో రూ.30 వేలు అదనంగా చార్జ్‌‌‌‌ చేశారని ఆయా కాలేజీల్లో అడ్మిటైన స్టూడెంట్లు తెలిపారు. నార్కట్‌‌‌‌పల్లిలోని ఓ కాలేజీలో ఏకంగా రూ.1.35 లక్షలు వసూలు చేస్తున్నట్టు స్టూడెంట్లు చెప్తున్నారు. 

స్లైడింగ్ ఫీజు పేరిట 5 వేలు..

యూనివర్సిటీ రూల్స్ ప్రకారంలో ట్యూషన్ ఫీజులోనే ల్యాబ్, లైబ్రరీ ఫీజు కలిపి ఉంటుంది. కానీ, కాలేజీల యాజమాన్యాలు మాత్రం ల్యాబ్, లైబ్రరీ ఫీజుల పేరిట అదనంగా వసూలు చేస్తున్నాయి. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేటు కాలేజీలోనైతే స్లైడింగ్ ఫీజు పేరిట రూ.5 వేలు చార్జ్ చేశారని ఓ స్టూడెంట్ తెలిపారు. తనకు ఫస్ట్ ఫేజ్‌‌‌‌లో కరీంనగర్ ప్రతిమ కాలేజీలో సీటు వచ్చిందని, సెకండ్ ఫేజ్‌‌‌‌లో మరో కాలేజీలో సీటు అలాట్ అయిందని మరో స్టూడెంట్ చెప్పాడు. రెండో కాలేజీలో చేరేందుకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రతిమ కాలేజీని అడిగితే స్లైడింగ్ ఫీజు పేరిట రూ.5 వేలు తీసుకున్నారని వెల్లడించాడు. 

డీడీల తిప్పలు

స్టూడెంట్లు కట్టే ఫీజు డీడీని అన్ని ఫేజుల కౌన్సిలింగ్ అయిపోయేదాకా కాలేజీలు వాడుకోకూడదు. కానీ, ప్రైవేటు కాలేజీలు డీడీలను ముందే వాడుకుంటున్నాయి. సెకండ్ ఫేజ్‌‌‌‌లో వేరే కాలేజీలో సీటు వచ్చిన స్టూడెంట్లు, డీడీ వెనక్కి ఇవ్వాలని అడిగితే క్యాష్ ఇస్తాం, ఆర్టీజీఎస్ చేస్తాం అని కాలేజీల యాజమాన్యాలు తిప్పలు పెడ్తున్నాయి. సీటు అలాట్ అయ్యాక కాలేజీలో చేరడానికి యూనివర్సిటీ ఒకట్రెండు రోజులే గడువిస్తోంది. ఈ టైమ్‌‌‌‌లోపు తొలి కాలేజీ నుంచి క్యాష్ తీసుకుని, బ్యాంకులో ఆ క్యాష్‌‌‌‌ను డీడీగా మార్చి రెండో కాలేజీలో ఇవ్వడం పేరెంట్స్‌‌‌‌కు తలకుమించిన భారంగా మారుతోంది. స్టూడెంట్‌‌‌‌కు వేరే కాలేజీలో సీటు అలాట్ అయితే, స్టూడెంట్స్‌‌‌‌ ఇచ్చిన ప్రతి పత్రం, ప్రతి పైసా కాలేజీలు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేలా యూనివర్సిటీ చర్యలు తీసుకోవాలి. కానీ, కాళోజీ వర్సిటీ ఈ విషయాలను సీరియస్‌‌‌‌గా తీసుకోక పోవట్లేదు. దీంతో మెడికల్ సీట్లు వచ్చిన స్టూడెంట్లకు, వాళ్ల తల్లిదండ్రులకు ఆదిలోనే అనేక ఇబ్బందులు తప్పట్లేదు.