
- రైల్వే, ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ అధిక చార్జీలు
- ఆర్టీసీ టికెట్‌పై 50 శాతం అదనపు వసూలు
- ప్రైవేట్ ట్రావెల్స్ డబుల్ దోపిడీ
- సొంత వాహనాల్లో వెళ్లేందుకు జనం ఆసక్తి
హైదరాబాద్, వెలుగు: దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై టికెట్ బాదుడు షురూ అయ్యింది. ఆర్టీసీ, రైల్వే, ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలను పెంచేశాయి. ఆర్టీసీ టికెట్‌పై 50 శాతం వరకు అదనంగా తీసుకుంటుండగా.. ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పెద్ద పండుగ కావడంతో చేసేదేం లేక జనాలు చార్జీ ఎంతైనా చెల్లించక తప్పడంలేదు. కొందరు మాత్రం తమ సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆర్టీసీ స్పెషల్ పేరుతో..
రాష్ట్రంలో అతిపెద్ద పండుగ దసరా. ఎవరు, ఎంత దూరంలో ఉన్నా ఫెస్టివల్ రోజున సొంతూర్లకు చేరుకుంటారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ఈ నెల 14వ తేదీ వరకు 4,035 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. 3,085 బస్సులను రాష్ట్రంలోని జిల్లాలకు, 950 బస్సులను ఏపీ, కర్నాటక వంటి పొరుగు రాష్ట్రాలకు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో టికెట్‌పై 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. వన్ వే ట్రాఫిక్ మాత్రమే ఉంటుందని, తిరిగి వచ్చేటప్పుడు రద్దీ ఉండదని, అందుకే అదనంగా వసూలు చేయాల్సి వస్తోందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. అయితే కొన్ని చోట్ల రెగ్యులర్ బస్సుల్లోనూ అదనపు చార్జీలు తీసుకుంటున్నారని, పల్లె వెలుగు బస్సులకు కూడా ఎక్స్‌ప్రెస్ బోర్డులు పెట్టి తిప్పుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్
దసరా రద్దీని ప్రైవేట్ ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి చార్జీలు అదనంగా పెంచాయి. రద్దీని ఆసరాగా చేసుకుని బస్సుల్లో డబుల్ బాదుడు షురూ చేస్తున్నాయి. సాధారణంగా రూ. వెయ్యి ఉన్న టికెట్‌ను రెండు వేలకు పెంచాయి. జనరల్‌గా విజయవాడకు నాన్ ఏసీ టికెట్ ధర రూ.500 వరకు ఉండగా, ఇప్పుడు వెయ్యి నుంచి 1,100 వరకు వసూలు చేస్తున్నారు. అన్ని రూట్లలోనూ ఇదే తీరుగా గుంజుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌పై ప్రభుత్వం, అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
రైల్వేలోనూ అదనపు చార్జీలు
రైల్వే కూడా దసరా సీజన్‌ను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కరోనా స్పెషల్ ట్రైన్స్‌ను నడుపుతుండగా.. తాజాగా పండుగ ప్రత్యేక రైళ్లు, తత్కాల్ ప్రత్యేక రైళ్ల పేరుతో ప్రయాణికులపై రూ.వంద నుంచి రూ.200 దాకా అదనంగా వసూలు చేస్తోంది. టికెట్ల ధర పెంపుతో బోగి రకం, దూరం బట్టి ఒక్కో ప్యాసింజర్‌పై 200 నుంచి 400 వరకు అదనపు భారం పడుతోంది. పండుగ నేపథ్యంలో టికెట్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు అనేక మంది సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కరోనా టైంలో అనేక మంది బండ్లు కొనుక్కున్న వాళ్లు, అధిక చార్జీలు భరించలేని వాళ్లు సొంతంగానే ప్లాన్లు
చేసుకుంటున్నారు.