వచ్చే మూడేళ్లలో ఎయిర్ పోర్టుల ప్రైవేటైజేషన్​

వచ్చే మూడేళ్లలో ఎయిర్ పోర్టుల ప్రైవేటైజేషన్​
  • వచ్చే మూడేళ్లలో ప్రైవేటైజేషన్​
  • ఎన్​ఎంపీ ద్వారా రూ.20,782 కోట్లు
  • ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆస్తుల అమ్మకంలో భాగంగా రాబోయే మూడేళ్లలో నేషనల్ మానిటైజేషన్ పైప్‌‌‌‌లైన్ (ఎన్ఎంపీ) కింద  కోసం దాదాపు 25 ఎయిర్‌‌పోర్ట్స్ ను అమ్ముతామని అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటించింది.   భువనేశ్వర్, వారణాసి, అమృత్‌‌సర్, తిరుచ్చి, ఇండోర్, రాయ్‌‌పూర్, కాలికట్, కోయంబత్తూర్, నాగ్‌‌పూర్, పాట్నా, మధురై, సూరత్, రాంచీ, జోధ్‌‌పూర్, చెన్నై, విజయవాడ, వడోదర, భోపాల్, తిరుపతి, హుబ్లీ, ఇంఫాల్, అగర్తలా, ఉదయపూర్, డెహ్రాడూన్, రాజమండ్రి ఎయిర్‌‌పోర్టుల ప్రైవేటైజేషన్‌‌కు కేంద్రం నుంచి పర్మిషన్లు వచ్చాయి. వచ్చే ఐదేళ్లలో దేశంలోని మరో 30 లేదా 35 విమానాశ్రయాలను ప్రైవేటైజ్‌‌ చేసే ఆలోచన ఉందా ? అని పార్లమెంటు సభ్యుడు మిమీ చక్రవర్తి అడిగిన ప్రశ్నకు బదులుగా సివిల్‌‌ ఏవియేషన్‌‌శాఖ సహాయ మంత్రి జనరల్ డాక్టర్ వీకే సింగ్ గురువారం లోక్‌‌సభలో  ఈ విషయాన్ని ప్రకటించారు. ఏడాదికి  నాలుగు లక్షల మంది ( 2019,  2020లో) కంటే ఎక్కువ ట్రాఫిక్‌‌ను ఉన్న విమానాశ్రయాలను నేషనల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌‌లైన్ (ఎన్ఐపీ)లో భాగంగా  ప్రైవేటైజ్‌‌ చేస్తామని వెల్లడించారు.   విమానాశ్రయాలను అమ్మడం ద్వారా 2025 ఆర్థిక సంవత్సరం వరకు సుమారు రూ. 20,782 కోట్లను సమీకరిస్తామని కేంద్రం ఈ ఏడాది ఆగస్టులో తెలిపింది. 2020–-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 137 విమానాశ్రయాలలో నాలుగు విమానాశ్రయాలు మినహా అన్నీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా నష్టాలను చవిచూస్తూనే ఉన్నాయి.  వీటిలో కందాలా (0.11 కోట్లు), కాన్పూర్ చకేరీ (6.07 కోట్లు), బరేలీ (0.68 కోట్లు)  పోర్ బందర్ (1.54 కోట్లు) ఎయిర్‌‌పోర్టులు మాత్రమే లాభాలను చూడగలిగాయి. "ఢిల్లీ,  ముంబై విమానాశ్రయాలు వరుసగా రూ. 317 కోట్లు,  రూ. 331 కోట్ల భారీ నష్టాన్ని చవిచూశాయి. 2019–-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 146 కోట్ల లాభాన్ని ఆర్జించిన గోవా  విమానాశ్రయం గత ఆర్థిక సంవత్సరంలో రూ. 118 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది.  గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా మిగతా విమానాశ్రయాలు నష్టాలను చవిచూస్తూనే ఉన్నాయి" అని సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఏఏఐ అధీనంలో 136 విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో ఏడింటిని జాయింట్ వెంచర్ల ద్వారా నిర్వహిస్తోంది.  అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గౌహతి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాల నిర్వహణ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టినట్టు ప్రకటించింది.