పేదలను బీజేపీ పట్టించుకోదు: ప్రియాంక

పేదలను బీజేపీ పట్టించుకోదు: ప్రియాంక

అజ్మీర్: బీజేపీ కుల, మతాల పేర్లు చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని..అభివృద్ధిని చూపి ఓట్లు అడిగే పరిస్థితిలో ఆ పార్టీ లేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ విమర్శించారు. రాజస్థాన్ అజ్మీర్ లోని కేక్డీలో సోమవారం జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఐకమత్యంగా ఎన్నికల బరిలోకి దిగారని తెలిపారు. బీజేపీ మాత్రం పూర్తిగా చిన్నాభిన్నమైందని చెప్పారు.

రాష్ట్రానికి చెందిన నేతలను ఆ పార్టీ పక్కకు తప్పించి.. కొత్త నాయకుడి కోసం వెతుకుతుందని పేర్కొన్నారు.  బడా పారిశామ్రిక వేత్తలకు లాభం చేకూర్చడమే బీజేపీ విధానమని వెల్లడించారు. పేదలు, మధ్య తరగతి ప్రజల గురించి ఆ పార్టీ ఆలోచించదన్నారు. ఒకవేళ రాష్ట్రంలో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ సర్కారు షురూ చేసిన సంక్షేమ పథకాలను ఆపేస్తుందని ఆమె రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.