Priyanka Mohan: "నన్ను తప్పుగా చిత్రీకరించకండి".. ఫేక్ ఫోటోలపై ప్రియాంక మోహన్ ఫైర్!

Priyanka Mohan: "నన్ను తప్పుగా చిత్రీకరించకండి".. ఫేక్ ఫోటోలపై ప్రియాంక మోహన్ ఫైర్!

టాలీవుడ్‌లో 'గ్యాంగ్ లీడర్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తన సహజ నటనతో ఆకట్టుకున్న చెన్నై బ్యూటీ ప్రియాంక మోహన్.. ఆ తర్వాత శ్రీకారం, సరిపోదా శనివారం వంటి చిత్రాలతో మెప్పించిన ఈ అమ్మడు రీసెంట్ గా 'ఓజీ'లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించింది. తమిళనాట ర్తికేయన్ హీరోగా 'డాక్టర్. దాస్' సినిమాలతోనూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవల ప్రియాంక ఫొటోలు కొన్ని నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 

నన్ను తప్పుగా చిత్రీకరించకండి..

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రియాంక మోహన్‌కు సంబంధించిన కొన్ని మార్ఫింగ్ (AI జనరేటెడ్) ఫొటోలు విపరీతంగా సర్క్యులేట్ అవుతుండటం కలకలం సృష్టించింది. దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ విజువల్స్ షేర్ చేయడం ఇకనైనా ఆపేయండి అంటూ ప్రియాంక మోహన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్న పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.  నన్ను తప్పుగా చిత్రీకరించే విధంగా కొన్ని AI జనరేటెడ్ చిత్రాలు సర్క్యులేట్ అవుతున్నాయి. దయచేసి వాటిని ఎవరూ నమ్మొద్దు. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు, ఎవరికీ షేర్ చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు.

AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను కేవలం నైతిక సృజనాత్మకత (Ethical Creativity) కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇలాంటి ఫేక్ సమాచారం, తప్పుడు చిత్రాల కోసం కాదు అని హితవు పలికారు ప్రియాంక మోహన్. మనం ఏమి క్రియేట్ చేస్తున్నాం, ఎలాంటి వాటిని ఇతరులతో పంచుకుంటున్నాం అనేదాని గురించి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరికీ ధన్యవాదాలు అని ఆమె ఆవేదనతో కూడిన హెచ్చరిక జారీ చేశారు.

 

ప్రియాంకకు మద్దతుగా నెటిజన్లు

ప్రియాంక మోహన్ పోస్ట్‌కు ఆమె అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. కొంతమంది నెటిజన్లు ప్రభుత్వాలు AI టెక్నాలజీ దుర్వినియోగంపై మరింత ఏకాగ్రత పెట్టాలని కోరారు. ఇలాంటి ఫేక్ ఫొటోలు క్రియేట్ చేసి ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఆనందం కోసం మరొకరి జీవితాన్ని బలి చేయడం ఏంటి? అంటూ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.

►ALSO READ | PM Modi-Ram Charan: ప్రధాని మోదీతో రామ్ చరణ్ దంపతులు భేటీ! ఎందుకంటే?

నిజానికి, ఇటీవల కాలంలో రష్మిక మందన్న వంటి ఇతర నటీమణులు కూడా ఇలాంటి డీప్‌ఫేక్ (Deepfake) టెక్నాలజీ బారిన పడ్డారు. దీనిపై సెలబ్రిటీలు ,  సైబర్ నిపుణుల నుంచి ఆందోళన పెరుగుతోంది. సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి టెక్నాలజీ దుర్వినియోగంపై కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సంఘటనలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.