రాజ్యసభకు ప్రియాంక?

రాజ్యసభకు ప్రియాంక?

పరిశీలిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్
ఛత్తీస్ గఢ్ నుంచి అవకాశం కల్పించాలంటున్న అక్కడి నేతలు

న్యూఢిల్లీకాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని యాక్టివ్ పాలిటిక్స్ లోకి తేనుందా? ఇన్నాళ్లు పార్టీ తరఫున ప్రచారానికే పరిమితమైన ప్రియాంక ఇక చట్ట సభల్లో అడుగుపెట్టనున్నారా? త్వరలోనే ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి ప్రియాంక గాంధీకి కేటాయించనున్నారా? అంటే కాంగ్రెస్ నేతలు అవుననే సమాధానం ఇస్తున్నారు.  ప్రియాంక గాంధీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తుందని చెబుతున్నారు. రాజ్యసభలో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రియాంకను రంగంలోకి దింపాలంటూ హైకమాండ్ కు పార్టీ నేతలు సూచిస్తున్నారు.  దీంతో కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ అంశంపై దృష్టి పెట్టారు.

బలహీనంగా మారుతున్న పార్టీకి ప్రియాంక ఎంట్రీ మేలు చేస్తుందని కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచిస్తుంది. ఇటీవల లోక్ సభలో రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శల దాడి పెంచారు.రాజ్యసభలో బీజేపీని ప్రియాంక ధీటుగా ఎదుర్కొంటారని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. పైగా మరో 2 ఏండల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే యూపీ పై ప్రియాంక ఫోకస్ పెట్టారు. ప్రియాంక ఎంపీగా ఉంటే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీకి బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి ప్రియాంక రాజ్యసభ సభ్యత్వం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ చివరి నాటికి రాజ్యసభలో 51 ఖాళీలు

ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి రాజ్యసభలో 51 స్థానాలు ఖాళీ కానున్నాయి. కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న  సీనియర్లు అంబికా సోని, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ ల పదవీకాలం ముగియనుంది. ఈ సారి సీనియర్లు కాకుండా కొత్త వారికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, జార్ఖండ్‌‌ల నుంచి కాంగ్రెస్ పార్టీ  ఖాళీలను భర్తీ చేయనుంది. ప్రియాంక గాంధీని ఛత్తీస్ గఢ్ నుంచి రాజ్యసభకు పంపాలని అక్కడి నేతలు కోరుతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. సీనియర్లలో గులాం నబీ ఆజాద్ కు మళ్లీ అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. జ్యోతిరాదిత్య సింథియా, కరుణా శుక్లా, రణ్‌‌దీప్ సింగ్ సుర్జేవాలా, భూపిందర్ సింగ్ హూడా లాంటి యువనేతలు రాజ్యసభ రేసులో ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం