మనోళ్లకు ఇది బెస్ట్​చాన్స్

మనోళ్లకు ఇది బెస్ట్​చాన్స్

న్యూఢిల్లీ: ఇండియా, ఇంగ్లండ్​ మధ్య జరిగే టెస్ట్​ సిరీస్​లో హోరాహోరీ పోరు ఖాయమని టీమిండియా మాజీ కెప్టెన్​ రాహుల్​ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ఇరుజట్లూ బలంగా కనిపిస్తున్నా ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్​ చేస్తే 3–2తో సిరీస్​ టీమిండియా సొంతమవుతుందని మిస్టర్​ డిపెండబుల్ ధీమా వ్యక్తం చేశాడు. జూన్​లో న్యూజిలాండ్​తో జరిగే వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ ఫైనల్​ అనంతరం ఇండియా... ఇంగ్లండ్​తో వారి గడ్డపై ఐదు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​ ఆడనుంది. ఆగస్ట్​– సెప్టెంబర్​ మధ్యలో జరిగే ఈ సిరీస్​ కోసం ఇండియా ఆల్రెడీ జట్టును కూడా ప్రకటించింది. అయితే ఆదివారం జరిగిన ఓ వెబినార్​లో పాల్గొన్న రాహుల్​.. తాజా టూర్​పై తన అభిప్రాయాలు వెల్లడించాడు. సిరీస్​లో ఇండియా, ఇంగ్లండ్​  చాన్స్​లపై మాట్లాడాడు. ‘ఈసారి ఇండియా, ఇంగ్లండ్​ మధ్య గొప్ప సిరీస్ చూడబోతున్నాం. ఈ సిరీస్‌‌లో ఇండియాకు చాలా ఎక్కువ అవకాశాలున్నాయి. అలాగని ఇంగ్లండ్​ బౌలింగ్​ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎలాంటి అటాక్​తో బరిలోకి దిగినా ఇంగ్లిష్​ జట్టు మంచి పెర్ఫామెన్స్​ ఇస్తుంది. పైగా ఇంగ్లండ్​ వద్ద చాలా మంది నాణ్యమైన ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. వాళ్లలో ఎవరిని ఎంపిక చేసుకుంటుందనేది ఆసక్తికరం. ఇంగ్లండ్​ బ్యాటింగ్​ లైనప్ కూడా చాలా బలంగా ఉంది. టాప్​– 7లో చాలా మంచి ప్లేయర్లున్నారు. ముఖ్యంగా జో రూట్​ రూపంలో ఓ వరల్డ్​ క్లాస్​ బ్యాట్స్‌‌మన్‌‌ అందుబాటులో ఉన్నాడు. గొప్ప ఆల్‌‌రౌండర్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌ ఉండనే ఉన్నాడు. అయితే ఈ టూర్‌‌లో ఇండియా సక్సెస్‌‌ కావాలంటే అశ్విన్ అద్భుతంగా రాణించాలి. మన దగ్గర ఆడినప్పుడు స్టోక్స్‌‌ను అశ్విన్ కట్టడి చేశాడు. కానీ ఈసారి బెన్ సొంతగడ్డపై ఆడనున్నాడు. అందువల్ల వారిద్దరి మధ్య మరోసారి ఆసక్తికర పోరాటం తప్పదనిపిస్తోంది. ఈ టూర్​ విషయంలో టీమిండియా.. ఆస్ట్రేలియా నుంచి ఓ విషయం నేర్చుకోవాలి. ఆసీస్​ మాదిరిగా జట్టుపై నమ్మకం ఉంచాలి. టీమిండియాలో కొందరికి ఇప్పటికే ఇంగ్లండ్​లో ఆడిన అనుభవం ఉండటం ఈసారి అడ్వాంటేజ్​. వారి అనుభవం బ్యాటింగ్​లో చాలా ఉపయోగపడుతుంది.​ అందువల్ల ఈసారి పోటాపోటీ తప్పదు. ఎంత పోటీ ఉన్నా ఇండియా 3–2తో సిరీస్​ సొంతం చేసుకునే చాన్స్ అయితే ఉంది’ అని ద్రవిడ్​ చెప్పుకొచ్చాడు.

కోహ్లీసేనకు ఆ గ్యాప్​ అడ్వాంటేజ్​..

డబ్ల్యూటీసీ ఫైనల్​కు, ఇంగ్లండ్​ సిరీస్​ మధ్య దాదాపు రెండు నెలల  టైమ్ ఉండటం కోహ్లీ సేనకు అడ్వాంటేజ్​ కానుందని ద్రవిడ్​ చెప్పాడు. ఓ సిరీస్​ ప్రిపరేషన్​కు ఇలాంటి చాన్స్​ దొరకడం చాలా పెద్ద విషయమన్నాడు. ‘ ఇంగ్లండ్​లో ఈసారి ఇండియా బాగా పెర్ఫామ్​ చేస్తుందని నమ్మకంగా ఉన్నా. డబ్ల్యూటీసీ ఫైనల్​ కోసం కోహ్లీ సేన జూన్​ 2న ఇంగ్లండ్​ చేరుకుంటుంది. ఆ ఫైనల్​ ముగిసిన చాలా రోజుల తర్వాత టెస్ట్ సిరీస్​ స్టార్ట్​ అవుతుంది. ఈ మధ్యలో రెండు నెలల వరకు గ్యాప్​ ఉండగా జట్టు మొత్తం అక్కడే ఉండనుంది. సిరీస్​ ప్రిపరేషన్ విషయంలో ఇంత టైమ్​ దొరకడం చాలా అరుదు. ఇప్పుడిదే జట్టుకు అడ్వాంటేజ్. ఇంగ్లండ్​లో ఒక విషయాన్ని ప్లేయర్లు ఎప్పటికీ మరచిపోకూడదు. 50 రన్స్​ చేసిన తర్వాత కూడా క్రీజులో  కుదురుకున్నామని భావించకూడదు. ఎందుకంటే ఇండియా, ఆస్ట్రేలియాతో పోలిస్తే ఇంగ్లండ్​ పరిస్థితులు చాలా డిఫరెంట్‌‌గా ఉంటాయి. వాతావరణం పరీక్ష పెడుతుంది. 40 ఓవర్ల తర్వాత కూడా బాల్​ అనూహ్యంగా స్వింగ్​ అవుతుంది. ప్లేయర్లు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ఇండియా, ఆసీస్‌‌లో 40–50 ఓవర్ల తర్వాత కుకాబుర్రా బాల్​ సాఫ్ట్​ అయిపోతుంది. బ్యాటింగ్​కు అనుకూలంగా తయారవుతుంది. కానీ ఇంగ్లండ్​లో వాడే డ్యూక్​ బాల్​ విషయంలో అలా జరగదు. క్రీజులో ఉన్నంతసేపు ఏకాగ్రతతో ఉండాలి. లేదంటే పార్ట్​నర్​షిప్స్​ నిర్మించడం చాలా కష్టం. పరిస్థితులు వేగంగా మారిపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్లేయర్లకు నేనిచ్చే సలహా ఒక్కటే. క్రీజులో గంటల తరబడి గడిపిన తర్వాత కూడా ప్లేయర్లు తమ వికెట్​కు మర్యాద ఇచ్చి తీరాలి. ఏ బాల్​కు ఆ బాల్​ అన్నట్టుగా జాగ్రత్తగా మనుసు పెట్టి ఆడాలి. భారీ స్కోరు చేయగలిగితేనే ప్రత్యర్థికి పోటీ ఇవ్వగలం’ అని మాజీ కెప్టెన్​ వ్యాఖ్యానించాడు.

తుది జట్టుపై క్లారిటీ ఉంటుంది..

ఇంగ్లండ్​ టూర్​ కోసం ఇండియా ఇప్పటికే 20 మంది ప్లేయర్లతో జట్టును అనౌన్స్​ చేసింది. ఇందులో పలువురు రిజర్వులుగా ఉన్నారు. అయితే, సెలెక్షన్​ ప్రక్రియ చూస్తే తుది జట్టు విషయంలో మేనేజ్​మెంట్​ ఒక క్లారిటీతో ఉందనే విషయం అర్థమవుతోందని ద్రవిడ్​ వెల్లడించాడు. ‘20 మంది ప్లేయర్ల జట్టు చాలా బ్యాలెన్స్​డ్​గా కనిపిస్తోంది. నాణ్యమైన బ్యాట్స్​మెన్​, ఆల్​రౌండర్లతో పాటు పర్ఫెక్ట్​ బౌలింగ్​ను ఎంచుకున్నారు. స్పిన్​ ఆల్​రౌండర్లుగా  అక్షర్​ పటేల్​, రవీంద్ర జడేజా, వాషింగ్టన్​ సుందర్​ జట్టులో ఉండటం బలాన్ని పెంచింది. దీనిని బట్టి టీమ్​ కాంబినేషన్​ విషయంలో మేనేజ్​మెంట్​కు ఉన్న​ క్లారిటీని అర్థం చేసుకోవచ్చు. అశ్విన్​, జడేజా ఇద్దరూ బ్యాట్​, బాల్​తో రాణించగలరు. అక్షర్​, సుందర్​ ఒకరికొకరు తగిన రీప్లేస్​మెంట్స్​. ఈ నలుగురు స్పిన్నర్ల వల్ల బ్యాటింగ్​ డెప్త్​ కూడా పెరుగుతుంది. అంతేకాక ఇంగ్లండ్​ బయలుదేరే ముందే ఫైనల్​ ఎలెవెన్​పై క్లారిటీ తీసుకువస్తారు’ అని రాహుల్​ పేర్కొన్నాడు.