కేంద్రం గోడౌన్లను తగ్గించడం వల్లే సమస్యలు : వివేక్ వెంకటస్వామి

కేంద్రం గోడౌన్లను తగ్గించడం వల్లే సమస్యలు : వివేక్ వెంకటస్వామి
  • ధాన్యం నిల్వకు స్పేస్ లేక రైతులకు కష్టాలు
  •     ప్రైవేటోళ్లకు గోడౌన్లను సరెండర్ చేసిన కేంద్రం
  •     రైతులను ఆదుకునే ఉద్దేశం ఉంటే గోడౌన్లను పెంచాలె
  •     రైతులపై లాఠీచార్జీ చేయించిన ఘనత బీజేపీదని ఫైర్

హైదరాబాద్, వెలుగు: వడ్ల కొనుగోలు, తరలింపు, నిల్వ విషయంలో అసలు సమస్య ఎఫ్​సీఐ, కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మిల్లర్ల నుంచి ఎఫ్​సీఐకి ధాన్యాన్ని ఇచ్చినప్పుడు.. వాటిని నిల్వ చేయడానికి గోడౌన్లు సరిగ్గా లేవన్నారు. ప్రైవేటైజేషన్ పేరుతో గోడౌన్ల సంఖ్యను భారీగా తగ్గించారని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. గోడౌన్లను ప్రైవేటోళ్లకు సరెండర్ చేసి.. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న గోడౌన్ల స్పేస్​ను తగ్గించిందని చెప్పారు. కేంద్రం అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తున్నదని మండిపడ్డారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం కేంద్రానికి ఉంటే.. వెంటనే గోడౌన్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, వడ్లను తరలించేందుకు లారీల సంఖ్యను పెంచాలని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో మాట్లాడానని చెప్పారు. ఈసారి వడ్లు ఎక్కువగా పండాయని.. దానికి తగినట్టు హమాలీలు, లారీల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.

రాజకీయాలకు తావు లేకుండా రైతును ఆదుకుందాం

రైతుల బాగు కోసం ఎంఎస్​పీ చట్టం చేస్తామని కాంగ్రెస్​ పార్టీ హామీ ఇచ్చిందని, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంఎస్​పీ చట్టం చేయాలని వివేక్​ వెంకటస్వామి డిమాండ్​ చేశారు. ఉత్తరాది రైతులు హక్కుల కోసం కొట్లాడుతుంటే.. వారిపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని మండిపడ్డారు. రైతులతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రతిపైసా కేంద్రమే ఖర్చు పెడుతున్నదని నిరుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని, గోడౌన్లనూ కేంద్రమే చూసుకుంటుందని చెప్పారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు అకాల వర్షాలతో పంట నష్టపోతున్నా గోడౌన్ స్పేస్ ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఇందులో రాజకీయాలకు తావులేకుండా అందరం కలిసి రైతులను ఆదుకుందామని పిలుపునిచ్చారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, రైతులెవరూ ఆందోళన చెందొద్దన్నారు. ఈ మూడు నాలుగు రోజుల్లో వడ్లన్నీ మిల్లుల్లో అన్​లోడింగ్ చేసి రైతుల ఇబ్బందులు తగ్గిచే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.