
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి పెరిగిన డిమాండ్
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షులను నియమించే ప్రక్రియ శనివారం మొదలైంది. నేటి నుంచి 20 తేదీ వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిశీలకులు పర్యటిస్తారు. ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్‌చార్జి ఏఐసీసీ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, పార్టీ పరిశీలకులు, ఏఐసీసీ మాజీ సెక్రటరీ బిశ్వరంజన్ మహంతి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అధ్యక్షతన నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు ఆఫీసులో ఈ కార్యక్రమం ప్రారంభించారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పరిశీలకుడిగా శరత్ రౌథ్ను నియమించారు.
డీసీసీ అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, నాలుగు స్టేజీల్లో అభిప్రాయ సేకరణ చేస్తామని పరిశీలకులు చెప్పారు. మొదటి విడత నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్‌తో, రెండో విడత బ్లాక్ కాంగ్రెస్ లీడర్లు, అన్ని మండలాలు కలిపి పార్టీ ముఖ్యులతో వన్ టు వన్ చర్చిస్తారు. మూడో విడత పట్టణ కాంగ్రెస్ కమిటీ, నాలుగో విడతలో నియోజకవర్గంలోని ముఖ్యమైన పార్టీ లీడర్లతో వన్‌టు వన్ అభిప్రాయాలను సేకరిస్తారు. ప్రతి నియోజకవర్గం నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మహిళ, మైనార్టీ వర్గాలకు ప్రయార్టీ ఇస్తారు. జిల్లా మొత్తం మీద అభి ప్రాయాలను క్రోడీకరించిన తర్వాత అధిష్టానం ఆమోదంతో డీసీసీ అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ ముగిశాక మండల, బ్లాక్, గ్రామ స్థాయి కమిటీల నియమిస్తారు.
సూర్యాపేటలో పోటాపోటీ
సూర్యాపేట జిల్లా ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కు తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా అవకాశం దక్కింది. దీంతో సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడి మార్పు ఖాయంగా మారింది. సూర్యాపేట జిల్లా నుంచి డీసీసీ పీఠం దక్కించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందూలోనూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఉండటంతో వారంతా సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన నేతకే ఆ అవకాశం దక్కుతుందనే చర్చ జోరుగా
జరుగుతోంది.
యాదాద్రి జిల్లాలో దక్కేదెవరికి
యాదాద్రి జిల్లా ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ఆడెం సంజీవరెడ్డికి ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో.. తనకు రెండవసారి కూడా అధ్యక్ష పీఠం దక్కుతుందని భావిస్తున్నారు. భువనగిరికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, బీసీ సామాజిక వర్గానికి చెందిన పోత్నక్ ప్రమోద్ కుమార్ డీసీసీ పీఠంపై గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. ఆయనకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది.
మరో సీనియర్ నేత, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ డీసీసీ పీఠం కొసం గట్టిగానే పట్టుబడుతున్నారు. దీంతో డీసీసీ పీఠం విషయంలో ఏఐసీసీ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి జిల్లా సీనియర్ నేతలు ఎవరివైపు మొగ్గు చూపుతారు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏవిధంగా ప్రభావితం చేస్తాయి.. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిలలో ఎవరి పంతం నెగ్గుతుంది, అంతిమంగా డీసీసీ పీఠం ఎవరిని వరిస్తుంది అనే సస్పెన్స్ కు తెరపడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సీందే అంటున్నారు.
నల్గొండలో ఆశవహులు..
నల్గొండలో డీసీసీ రేసులో ఉన్న ఆశవాహులు పరిశీలకులకు దరఖాస్తులకు అందజేశారు. గత కొన్నేళ్ల నుంచి పార్టీ కోసం చేస్తున్న సేవలు, కృషి గురించి తెలియజేస్తూ బయోడేటాలు అందజేశారు. కొండటే మల్లయ్య (ఎస్సీ), పున్న కైలాష్ నేత (బీసీ), గుమ్మల మోహన్ రెడ్డి (ఓసీ) చామల శ్రీను (బీసీ), దైదా రవీందర్ (ఎస్సీ) డీసీసీ పదవి కోరుతున్నారు. నల్గొండ మున్సిపల్మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అబ్బగోని రమేశ్ గౌడ్, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు.
జానారెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిల మద్దతు మల్లయ్యకు ఉంది. నకిరేకల్ఎమ్మెల్యే వేముల వీరేశం మద్దతుతో చామల శ్రీను, దైదా రవీందర్ రేసులో ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి సపోర్టుతో పున్నా కైలాష్ నేత అప్లై చేశారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా నల్గొండ బీసీ లేదా ఎస్సీ, యాదాద్రి ఓసీ, సూర్యాపేట జిల్లా జనరల్ లేదా బీసీలకు కేటాయించే అవకాశం ఉందని తెలిసింది.