ఒక రోజులో తీసుకునే నిర్ణయం కాదు

ఒక రోజులో తీసుకునే నిర్ణయం కాదు

సినీ కార్మికుల వేతనాల పెంపు ఒక రోజులో తీసుకునే నిర్ణయం కాదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన సినీ కార్మికుల వేతన సవరింపులపై ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. తొలి రోజు జరిగిన సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది.. వేతనాల పెంపుపై ఫెడరేషన్ సభ్యులతో చర్చించామన్నారు. అయితే సినీ కార్మికుల వేతనాల పెంపు ఒక రోజులో తీసుకునే నిర్ణయం కాదని దిల్ రాజు అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య ఆరోగ్యకరమైన చర్చే జరుగుతుందని తెలిపారు. వేతనాల విషయంలో ఇంకా కొన్ని రోజులు సమన్వయ కమిటీ భేటీ జరుగుతుందన్నారు. ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నామో అవి మళ్ళీ వెల్లడిస్తామని దిల్ రాజు పేర్కొన్నారు.

ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ..దిల్ రాజు నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయన్నారు. అతి కొద్ది రోజుల్లోనే కార్మికుల వేతనాలపై అంతిమ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని అనిల్ స్పష్టం చేశారు. ఈరోజు షూటింగ్ లు జరుగుతున్నాయని వెల్లడించారు.