హేమ విషయంలో వాస్తవాలు బయటకు రావాలి: నట్టి కుమార్

హేమ విషయంలో వాస్తవాలు బయటకు రావాలి:  నట్టి కుమార్

బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్న విషయంపై సీనియర్ నిర్మాత  నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వినియోగం, రేవ్ పార్టీలు ఎక్కడ జరిగినా... ఎవరో ఒకరు సినిమావాళ్లు పాల్గొన్నా, పట్టుబడినా..  ఆ నేరాన్ని సినీ పరిశ్రమకు అంతా ఆపాదిస్తున్నారని నట్టి కుమార్ అసహనం వ్యక్తం చేశారు. దీనివల్ల సినిమా వారిని బయట చీప్ గా చూస్తున్నారని చెప్పారు. వాస్తవానికి.. తప్పు చేసినవారు ఎవరైనా.. ఎంతటివారైనా శిక్ష పడాల్సిందేనన్నారు. అందుకే.. సినీ పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా, నిజంగా తప్పు చేసారని నిరూపణ అయితే అలాంటి  వారిని నిషేధిస్తూ  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, పరిశ్రమకు చెందిన ఛాంబర్ వంటి సంస్థలు చర్యలు తీసుకోవాలని  నట్టి కుమార్ అన్నారు.

మే 23వ తేదీ గురువారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. "సినిమా నటి హేమ  విషయంలో వాస్తవాలు బయటకు రావాలి. ఒకవేళ ఆమె తప్పు చేసినట్లు రుజువైతే మా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలి. ఆ మధ్య గోవాలో సురేష్ కొండేటి ఏర్పాటు చేసిన అవార్డుల ఫంక్షన్ లో లోపాలు జరిగాయి. ఫిర్యాదులు వస్తే.. అతనిని నిషేదిస్తున్నట్లు పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అతను ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ ఫంక్షన్ అది. ఆ విషయంపైనే పరిశ్రమ వర్గాలు అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు హేమ విషయంలో కూడా వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలి. నిజంగా బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొనకపోతే, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ద్వారా కర్ణాటక గవర్నమెంట్ తో మాట్లాడించి, ఇందుకు బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలి" అని చెప్పారు.