పటిష్ట వ్యూహాలతోనే.. జనాభా పెరుగుదలకు చెక్​

పటిష్ట వ్యూహాలతోనే.. జనాభా పెరుగుదలకు చెక్​

ప్రపంచ జనాభా 10 మిలియన్స్ నుంచి 1 బిలియన్ చేరుకోవడానికి 5,000 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే సైన్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిపోవడం,  జననాల రేటు పెరుగుతూనే ఉండటం జనాభా విస్ఫోటనానికి ప్రధాన కారణమైంది. 2011లో ప్రపంచ జనాభా7 బిలియన్ మార్కుకు చేరుకుంది, నేడు ప్రపంచ జనాభా 800 కోట్లు దాటింది. ఇది 2030లో సుమారు8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు, 2100లో 10.9 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. దీంతోపాటు, సగటు ప్రపంచ జీవితకాలం1990ల ప్రారంభంలో 64.6 సంవత్సరాల నుంచి 2019లో 72.6 సంవత్సరాలకు పెరిగింది. అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్ జనాభా పెరుగుదల రేటు ఆయా దేశాలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. 3 దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న పౌష్టికాహారం, ప్రజారోగ్య సంరక్షణ, పౌరుల్లో పరిశుభ్రత, శాస్త్రీయ పురోగతి జనాభా పెరుగుదలకు పరిపూరకరమైన అంశాలు అని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 1950 నుంచి ప్రపంచ జనాభా పెరుగుదల మందగించింది. అయితే, ఇది ఆశించినంతగా తగ్గలేదని నివేదిక తెలిపింది. జనాభాతోపాటు అసమానతలు కూడా పెరిగాయి. జనాభాలో సగం మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. ప్రపంచ జనాభా పెరుగుతున్న కొద్దీ పోషకాహార లోపం కూడా పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా1.4 కోట్ల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. నేటికీ, ప్రపంచవ్యాప్తంగా150 మిలియన్ల మంది ప్రజలు పోషకాహార లోపం చీకటి నీడలోనే ఉన్నారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 65 ఏండ్లు పైబడిన వారి సంఖ్య రెట్టింపు అవుతుంది. 

జననాల రేటు నియంత్రించక..

చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా జనాభా లెక్కల డేటాకు ముందే, 2027 నాటికి చైనా జనాభా భారతదేశాన్ని అధిగమిస్తుందని కూడా అంచనాలు వచ్చాయి. ఎందుకంటే జనాభా పరివర్తనలో భారతదేశం చాలా ముందు ఉంది. స్వాతంత్ర్య కాలంలో 350 మిలియన్ల జనాభా కలిగిన ఇండియా ఇప్పటికీ అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. 1951లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించడానికి ఇది కారణం. అప్పటి నుంచి దేశ జనాభా 4 రెట్లు పెరిగింది, 2019లో 1.37 బిలియన్ల జనాభా ఉంది. భారతదేశ జనాభా గణనీయంగా పెరుగుతూ ఉండటం కొంత ఆందోళన కలిగించే విషయం. భారతదేశంలో జనాభా పెరుగుదలకు రెండు ముఖ్యమైన కారణాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి మరణాల రేటు కంటే జననాల రేటు ఎక్కువగా ఉండటం. సంతానోత్పత్తి రేటు ఇప్పటికీ అవసరమైన దానికంటే ఎక్కువగా నమోదు కావడం. మరణాల రేటును తగ్గించడంలో ప్రభుత్వం చాలా వరకు విజయం సాధించింది, కానీ జననాల రేటు తగ్గించడంలో పూర్తిగా సఫలం కాలేదని చెప్పవచ్చు. 

దేశాల సమష్టి వ్యూహం అవసరం..

దేశం తన జనాభా డివిడెండ్​ను పొందడంలో విఫలమైతే ఏం జరుగుతుంది? ఎక్కువగా పనిచేసే వయసు -యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోతారు. ఇది ఇప్పటికే పెరుగుతున్న ఆందోళన, కరోనా ఇప్పటివరకు 300 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసింది. ఈ పరిస్థితి ఇప్పుడున్నదానికంటే చాలా ఘోరంగా మారవచ్చు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు కార్మికులపై ప్రభావం పడి వృద్ధి మరింత మందగిస్తుంది. వృద్ధుల ఆర్థిక అభద్రత పెరుగుతుంది. భారతీయ విధాన రూపకర్తలు ఏ నైపుణ్యాలకు డిమాండ్ ఉందో గుర్తించాలి. తయారీ, ఆధునిక సేవల్లో ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి చెందుతున్న రంగాలను కూడా గుర్తించాలి. ఈ నైపుణ్యాలను పెంపొందించడం, శిక్షణ ఇవ్వడం, ఉపాధి కార్యక్రమాల కేంద్రంగా ఉండాలి. భారతదేశం పెద్ద, ఉన్నత విద్యావంతులైన శ్రామిక శక్తి సరఫరాను పెంచాల్సిన అవసరం ఉంది. పాఠశాల, ఉన్నత విద్యా విధానాలు యువతీయువకుల్లో సృజనాత్మకతను, నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఉండాలి. అప్పుడే రాబోయే రోజుల్లో దేశం సంతులిత వృద్ధి చెందడానికి అవకాశం సంపూర్ణంగా ఉంటుంది. జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఒక రాష్ట్రం, దేశం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కలిసికట్టుగా పటిష్ట విధానాన్ని అవలంబించాలి. ఉన్న మానవ వనరులను సమర్థంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతిపైన భారాన్ని తగ్గించి, మానవ, జీవజాతుల శ్రేయస్సుకు దోహదకారిగా మారాలి. ‘చిన్న కుటుంబం చింతలేని కుటుంబం’ అనే నినాదాన్ని భారతదేశంలో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. 

మెరుగైన సేవలు అందించాలి

పేద ప్రజలు కూడా తమ పిల్లలకు నాణ్యమైన చదువు అందాలని, మెరుగైన జీవితం గడపాలని కోరుకోవడం సహజమే.  కానీ అధిక సంతానంతో అది సాధించడం చాలా కష్టతరమైనదిగా ఉంటుంది. దీర్ఘకాలంలో సామాజికంగా, సంక్షేమ పథకాల పరంగా ప్రభుత్వంపై అధిక భారం కూడా ఉంటుంది. అందుకే జనాభా నియంత్రణ విషయంలో ప్రభుత్వం,  విధాన నిర్ణేతలు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రూపొందించిన చట్టాలను కచ్చితంగా పాటించేలా చూడాలి. చిన్న కుటుంబాల ప్రయోజనాలపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించి, నాణ్యమైన ఉపాధి, పిల్లలకు ఉచిత విద్య, వైద్య సాయంతో పాటు చిన్న కుటుంబాలకు స్కాలర్‌‌షిప్‌‌లను అందించాలి. జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు కుటుంబ నియంత్రణ వంటి కార్యక్రమాలను ఉల్లంఘిస్తున్న వారికి ప్రభుత్వం ఇస్తున్న వివిధ ప్రయోజనాలను తగ్గించాలి. విద్య విస్తరణ, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన, ఉచిత కండోమ్‌‌లు, గర్భనిరోధక మాత్రల పంపిణీ, మహిళా సాధికారతకు ప్రాధాన్యం, పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు వంటి చర్యలు జనాభా పెరుగుదలను ఆపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గ్రామీణ లేదా పట్టణ పరిస్థితులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ప్రతి పిల్లవాడు ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి, మార్కెట్ డిమాండ్‌‌కు అనుగుణంగా తగిన నైపుణ్యం, శిక్షణతో బయటకు వెళ్లి నాణ్యమైన మానవ వనరుగా మారేందుకు 
తోడ్పాటునందించాలి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో రౌండ్ డేటా ప్రకారం భారతదేశం మొత్తం సంతానోత్పత్తి రేటు(టీఎఫ్ఆర్) మునుపటి రౌండ్‌‌లో 2.2 నుండి 2.0కి తగ్గిందని వెల్లడించింది. అయినప్పటికీ, ఐదు రాష్ట్రాలు ఇప్పటికీ అధిక టీఎఫ్ఆర్ ను కలిగి ఉన్నాయి. అధిక జనాభా పెరుగుదల ఆర్థిక వ్యవస్థ అంతర్లీన వృద్ధి రేటు, నిర్మాణాత్మక ఉత్పాదకత పెరుగుదల, జీవన ప్రమాణాలు, పొదుపు రేట్లు, వినియోగం, పెట్టుబడిపై ప్రభావం చూపుతుంది. ఇది దీర్ఘకాలిక నిరుద్యోగ రేటు, సమతుల్య వడ్డీ రేటు, హౌసింగ్ మార్కెట్ పోకడలు, ఆర్థిక ఆస్తుల డిమాండ్‌‌పై ప్రభావం చూపుతుంది. జనాభా ధోరణుల్లో తేడాలు కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్‌‌లు, ఎక్స్ఛేంజ్ రేట్లను ప్రభావితం చేస్తాయని ఆశించవచ్చు. కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి, మారుతున్న జనాభా, ద్రవ్య, ఆర్థిక విధాన రూపకర్తలకు అవి ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఇది సాయపడుతుంది. అధిక జనాభా వల్ల సహజ వనరులను వేగవంతంగా వినియోగించుకోవడంతో భవిష్యత్తు తరాలకు కొరత ఏర్పడే అవకాశం ఉంది. 

పర్యావరణంపై ప్రభావం

పెరుగుతున్న జనాభా రెండు ప్రధాన రూపాల్లో పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది. మొదటిది భూమి, ఆహారం, నీరు, గాలి, ఖనిజాలు, శిలాజ ఇంధనాలతో సహా వనరుల వినియోగం. రెండవది కాలుష్య కారకాలు(గాలి, నీరు), విష పదార్థాలు, గ్రీన్​హౌస్ వాయువులతో సహా వ్యర్థ ఉత్పత్తులుగా చూడవచ్చు. అధిక జనాభాతో సహజ వనరుల వినియోగం బాగా పెరిగి ప్రకృతిపై  విష ప్రభావాన్ని చూపుతుంది. నేడు ప్రపంచంలోని అనేక రకాల వ్యాధులకు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులే ప్రధాన కారణం. దానికి  జనాభా పెరుగుదల కూడా ఒక ప్రధాన కారణం. అధిక జనాభా ప్రభుత్వంపైన కూడా వివిధ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు అధికమైన ఆర్థిక భారానికి కారణం అవుతుంది. అందుకే దేశంలో జనాభా నియంత్రణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. 2019 ఆగస్టు15న దేశ ప్రధాని మోడీ ‘జనాభా పెరుగుదల గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది’ అని ప్రకటించారు. దేశంలో చిన్న కుటుంబాల అవసరాన్నిపేర్కొంటూ, ఆ దిశగా సంతానోత్పత్తి తగ్గించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రజలు తమ సంతానానికి అవసరమైన విద్యాబుద్ధులు, నాణ్యమైన జీవితాలను, నైపుణ్యాలను పెంపొందించే స్థితిలో ఉండాలన్నారు. - చిట్టెడ్డి కృష్ణా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ