ఉద్యోగులను పాలేర్లుగా చూసిన బీఆర్ఎస్ : కోదండరాం

ఉద్యోగులను పాలేర్లుగా చూసిన బీఆర్ఎస్ : కోదండరాం
  • సమస్యల సాధనకు సంఘాలను పునరుద్ధరించాలి  

నిర్మల్/ ఖానాపూర్,  వెలుగు: గత బీఆర్‌‌ఎస్‌ సర్కారు ఉద్యోగులను పాలేర్లుగా చూసిందని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే సంఘాల పునరుద్ధరణ జరగాలని సూచించారు. ఆదివారం నిర్మల్‌లో విద్యావంతుల వేదిక, రిటైర్డ్ ఉద్యోగుల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మీటింగ్‌లో మాట్లాడారు.  ఉద్యోగ సంఘాల నేతలు గత ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ సంఘాలను నిర్వీర్యం చేశారని,ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు.

జిల్లాల విభజనను చేపట్టి స్థానిక రిజర్వేషన్లను అమలు చేయకుండా 317 జీవోతో సమస్యను సృష్టించారని విమర్శించారు.  317 జీవోను రద్దుచేసి ఉద్యోగులు, టీచర్లకు న్యాయం చేయాలన్నారు. హెల్త్ కార్డులు, సీపీఎస్‌తో పాటు రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై  ప్రభుత్వం దృష్టి పెట్టిందని వివరించారు.  విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్,  జన సమితి జిల్లా అధ్యక్షుడు తిలక్ రావ్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎంసీ లింగన్న,  ప్రజా సంఘాల నేత కొట్టే శేఖర్, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాంతి మోహన్ రెడ్డి, సర్దార్ , వినోద్, మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం ఖానాపూర్‌‌లో జరిగిన పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత బీఆర్‌‌ఎస్‌ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, కొందరు  ఆ పాలనను స్వర్ణయుగం అంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందన్నారు.

ఖానాపూర్‌‌లో  డిగ్రీ కాలేజీ ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీ, పోడు భూముల సమస్య, ఢీ 27 ,28 కాల్వల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి... పరిష్కారానికి చొరవ చూపుతానన్నారు.  టీజేఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కడపత్రి తిలక్ రావ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్‌లో రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాంతి మో హన్ రెడ్డి, సర్దార్ వినోద్, నేతలు గోన శ్రీనివాస్, బెన్హర్, సిరాజ్, రాజేశ్వర్రెడ్డి, లింగన్న, మల్లారెడ్డి, శ్రీనివాస్, రాజేశ్వర్ పాల్గొన్నారు.

కడెం ప్రాజెక్టు పైభాగంలో రిజర్వాయర్​ కట్టాలి

కడెం, వెలుగు : కడెం ప్రాజెక్టు రిపేర్ ​పనులను ఆదివారం టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన మాట్లాడుతూ కడెం ప్రాజెక్టుకు గతంలో రెండు సార్లు ముప్పు వచ్చినా గత సర్కారు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రిపేర్లకు నిధులు కేటాయించడం హర్షనీయమన్నారు.  కడెం ప్రాజెక్టుకు ముప్పు రాకుండా పైన ఒక రిజర్వాయర్ నిర్మించాలన్నారు. ఈ విషయాన్ని  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.