తెలంగాణ సాధన తపస్వి ప్రొఫెసర్ కుంభం మధుసూదన్ రెడ్డి

తెలంగాణ సాధన తపస్వి ప్రొఫెసర్ కుంభం మధుసూదన్ రెడ్డి

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మూడున్నర దశాబ్దాల పాటు వివిధ హోదాలలో  పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు తనదైన శైలిలో తొలి దశ, మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మేధావులలో ప్రొఫెసర్ కుంభం మధుసూదన్ రెడ్డి ఒకరు. వారు తన 90వ ఏట గత మంగళవారం  దివంగతులు కావడం తెలంగాణ మేధావులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగులను  ఉద్యమకారులకు తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. 

విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగానే కాకుండా  ఆర్ట్స్ కాలేజీ  ప్రిన్సిపాల్​గా వేలాదిమంది విద్యార్థులకు బోధనతోపాటు సమాజంలో  గౌరవప్రదంగా ఎదగడానికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి వారి సుస్థిర సమగ్ర అభివృద్ధికి తోడ్పడ్డ మరుపురాని గురువులు, విద్యాబోధకదక్షులు.  తన సుదీర్ఘ బోధన, పాలన అనుభవంతో వేలాదిమంది విద్యార్థి పరిశోధకులకు మార్గదర్శకులు అయినారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మూడున్నర దశాబ్దాలపాటు వివిధ హోదాలలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు తనదైన శైలిలో  తొలిదశ, మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 

ఉద్యమ ఆచార్యుడు 

విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా తెలంగాణలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. తెలంగాణ సమాజ ఎదుగుదలకు తనవంతు ఎనలేని కృషి చేశారు.  తెలంగాణ రాష్ట్ర సాధనకు నిరంతరం తప్పించారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో క్యాంపస్ విద్యార్థులను  చైతన్యవంతులను చేయడమే కాక, హైదరాబాదు నగరంతోపాటు క్షేత్రస్థాయిలో అనేక పట్టణాలు, గ్రామాలు తిరిగి గ్రామీణ ప్రాంతాల ప్రజలను తెలంగాణ ఏ విధంగా వివక్షకు గురి అవుతోందో స్పష్టంగా చెప్పేవారు.  కాకతీయ యూనివర్సిటీ ఉపాధ్యాయ విద్యార్థి పరిశోధకులతో అనేక సందర్భాల్లో క్యాంపస్  సభలలో మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను, ఉద్యమ రాజకీయ  వ్యూహాత్మక  ఎత్తుగడలను చర్చించేవారు, సూచించేవారు. 

నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి ఆయనొక అధ్యాపకుడిగా సేవలందించారు.  ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డితో నేను కూడా ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో తిరిగి తెలంగాణ సాధన గురించి విద్యార్థులకు, నిరుద్యోగులకు, గ్రామీణ యువతకు తెలియచేయడానికి పాల్గొనే అవకాశం లభించింది. నేను వ్యక్తిగతంగా వారి నుంచి జాతీయ, అంతర్జాతీయ  రాజకీయాల గురించి, అనేక సామాజిక సమస్యలకు పరిష్కారం లభించే చర్చలు చేయడం జరిగింది. 

విశ్రాంత జీవితంలోనూ..

విశ్రాంత ఆచార్యునిగా కూడా తన గృహంలో  కూడా సమయాన్ని వెచ్చించి అనుచరులతో, శిష్యులతో అనేక అంశాల గురించి చర్చ సాగించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వారితో సన్నిహితంగా మాట్లాడడానికి అవకాశం కల్పించుకొని కలిసే అవకాశం లభించింది. సాధించుకున్న తెలంగాణను ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశలో పరిపాలించాలని అందుకు భిన్నంగా జరుగుతున్న పాలన గురించి అనేక అంశాలను చర్చించేవారు. గ్రామాల్లో నివసిస్తున్న సాధారణ ప్రజలు యువత, స్త్రీలను కూడా తెలంగాణలో జరుగుతున్న వివక్షత గురించి చైతన్యపరచడంలో ప్రొఫెసర్ కుంభం మధుసూదన్ రెడ్డి మహాదిట్ట. 

వారి తర్వాత తరం మాలాంటివారు అనేకమంది ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి నుంచి స్ఫూర్తిపొందినవారమే అని గర్వంగా గుర్తుతెచ్చుకుంటున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో అవకతవకలతో కూడిన పరిపాలన విధానాన్ని గమనించిన మధుసూదన్ రెడ్డి అనేక సందర్భాల్లో తన అసంతృప్తిని వ్యక్తీకరించేవారు. గత పది సంవత్సరాలలో చోటు చేసుకుంటున్న ఆధిపత్య ధోరణలు అప్రజాస్వామిక పాలనను ఎదిరించాలని మాలాంటి వాళ్లకు హితబోధ చేసేవాడు. ప్రజలను యువతను చైతన్యం చేయాలి . ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పౌర సమాజం ఎల్లప్పుడూ చైతన్యంతో ఉండాలని సూచించేవారు. ఒక ఆచార్యునిగా కుంభం మధుసూదన్ రెడ్డి ఆచరించిన క్రమశిక్షణ బోధన ఆసక్తి, ప్రజా సమస్యల పట్ల అవగాహన పరిష్కార మార్గాలు సూచించడానికి తగిన పాత్ర పోషించే స్ఫూర్తిని ఈనాటి తరం పొందడమే వారికి ఘనమైన నివాళి. 

- ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ