అధ్యయనం లేని ప్రాజెక్టులు..నీటి కరువును తీర్చలేవు

అధ్యయనం లేని ప్రాజెక్టులు..నీటి కరువును తీర్చలేవు

వర్షం పడిన కొన్ని గంటలలోనే నదులలో నీటి ప్రవాహ వేగం అంతకంతకు పెరుగుతున్నది. ఒకప్పుడు కొన్ని రోజులు పట్టేది. వర్షం నేరుగా నదులలోకి వస్తే ఆపే శక్తి అతి పెద్ద ఆనకట్టలకు కూడా లేదు. ఆశ్చర్యం ఏమంటే ఇట్లాంటి దుస్థితికి పరిష్కారం ఇంకా పెద్ద ఆనకట్టలే అని మనం భావించడం. అసలు విషయం ఏమిటంటే ఆధునిక, మెగా ఆనకట్టల విధానమే పెరుగుతున్న నీటి కరువుకు కారణం.

ప్రజల ‘జ్ఞానం’ మీద, తెలివి మీద పొరలు కప్పే స్వార్థపర శక్తులు రాజకీయ, ఆర్థిక నిర్ణాయక వ్యవస్థలో వేళ్ళూనుకుపోయారు. వందల టీఎంసీల నీళ్ళు సముద్రంలోకి పోయినాయి అని గుండెలు బాదుకునే రాజకీయ నాయకులు ఆనకట్టల నిర్మాణంలో, నిర్వహణలో లోపాల వల్ల నీరు వదిలేసిన సందర్భాలలో కూడా స్పందించాలి. కాని స్పందించరు. 

ఘనమైన లెక్కలు చెప్పి నీళ్లు వదిలేస్తున్నరు

కడెం ఆనకట్ట గేటులో లోపాల వల్ల ఎన్ని నీళ్ళు, ఎన్ని యేండ్ల నుంచి వృధా అవుతున్నా పట్టించుకోలేదు. దానికి చేయాల్సిన మరమ్మతులకు కాని, నిర్వహణకు కాని తగిన నిధులు విడుదల చేయలేదు. ఆర్భాటంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు మునిగితే, పిల్లర్లకు పగుళ్ళు వస్తే నిలువ చేసిన కోట్ల లీటర్ల నీటిని వదిలేయాల్సి వచ్చింది. అప్పుడు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినా నీటి నిలువలను కాపాడుకోలేకపోయాము అని బాధ లేదు.

ఇట్లా ‘విలువ’ కలిగిన, నిలువ చేసిన నీటిని వదిలేస్తే పట్టించుకోని అధికార వ్యవస్థ ఇంకా కొత్త ఆనకట్టల నిర్మాణాలకు వాదన చేస్తూనే ఉంటారు.ఉదాహరణకు, కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ల పగుళ్ళు వలన తక్షణమే డ్యాం ఖాళీ చేశారు. అంటే దాదాపు రూ.13,328 కోట్ల విలువ ఉన్న నీటిని వదులుకోవాల్సి వచ్చింది. అంతకు ముందు 2022లో మోటార్లు మునిగిపోతే డ్యాం ఖాళీ చేశారు.

 దాదాపు రూ.1.67 లక్షల కోట్ల విలువ ఉన్న నీటిని సముద్రానికి వదిలేశారు. కట్టే ముందు తయారు చేసే డీపీఆర్​లలో ఘనమైన లెక్కలు వల్లె వేసే ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకులు కట్టినాక వృధాగా వదిలేసే నీటి విలువ గురించి నోరు విప్పక పోవటం ప్రజలు గమనించాలి. నష్టం ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అంత పెట్టుబడి పెట్టి ఈ ఏడు నీళ్ళు లేకపోవడం అంటే మనం పెట్టుబడులు పెట్టినా ‘పరిష్కారాలు’ మృగ్యం అయినట్టే. నీటి కొరత వలన వ్యవసాయం దెబ్బ తింటుంది. ఆహార ఉత్పత్తి మీద ప్రభావం ఉంటుంది. 

ప్రాజెక్టుల నిర్వహణ పట్టదు

ప్రభుత్వ పెట్టుబడులు అవసరమైన, సుస్థిరమైన విధంగా కాకుండా బుద్బుదప్రాయమైన నిర్మాణాలలో పెట్టడానికి అన్ని రకాల అస్త్రాలు తయారు చేసుకోవడం మన పాలక వ్యవస్థకు అలవాటు అయిపోయింది.  ఉన్న నీటి వనరుల గురించి కాని,  వాటి  నిర్వహణకు అవసరమైన పెట్టుబడులు పెట్టడం తమకు రాజకీయంగా ప్రయోజనం ఉండదనే పాలకులు పట్టించుకోరు. బడ్జెట్ నిబంధనలకు విరుద్ధంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ చాల తక్కువ ఖర్చు చేస్తున్నది.

ప్రాజెక్టులు కట్టడం మీద మాత్రం కేటాయింపుల కంటే ఖర్చు ఎక్కువగా ఉందని 2020- –21 రాష్ట్ర ఆర్థిక ఖాతాలపై కాగ్ నివేదించింది. నీటిపారుదల ప్రాజెక్టు నిర్వహణపై 2020-–21లో కేటాయింపు రూ.280.81 కోట్లు ఉన్నా కేవలం 14.19% ఖర్చు చేయబడింది - చిన్న మొత్తంలో రూ.39.85 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా, బడ్జెట్ కేటాయింపులతో పోల్చితే, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణపై అంతకుముందు సంవత్సరం (2019-–20)లో కూడా ఖర్చు తక్కువగా ఉంది. 

నిజాం సాగర్​ను పట్టించుకున్నారా?

2023లొ వందేండ్లు పూర్తి చేసుకున్న నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ మీద పెట్టిన ఖర్చు చాల తక్కువ. 2022లో రూ.75 కోట్లతో 8 కొత్త గేట్లు, స్పిల్ వే మరమ్మతులు, ఇంకా ఇతర రిపేర్లు చేస్తామని ప్రకటించినా వాస్తవంగా చేసింది ఎంతనో సమాచారం లేదు. రిజర్వాయర్లో ఎప్పటి నుంచో పేరుకుపోయిన ఇసుక, ఒండ్రు తీస్తే ప్రాజెక్ట్ నిలువ సామర్థ్యం పెరుగుతుంది. ఉన్న ప్రాజెక్టుల నిత్య నిర్వహణ ఖర్చులు, రిపేర్లు వగైరా మీద ఖర్చు పెట్టకపోవడంతో ఆశించిన సాగు నీటి పారుదల సామర్థ్యం తగ్గిపోయింది. 

ప్రాజెక్టులు ఆర్థిక, రాజకీయ లబ్ధిగా మారాయి

కొత్త నీటి ప్రాజెక్టుల ఖర్చు భారం కాదు, ఫలితాలు వీటిని మించి వస్తాయని నమ్మబలుకుతారు. అందరూ కలిసి ప్రజలను నమ్మిస్తారు. డిజైన్ మార్పులు, నిర్మాణంలో ఆలస్యం, అధికార అలసత్వం, ఖర్చు పెరగడం వంటి కారణాల వల్ల ప్రాజెక్టు ప్రయోజనాలు ఎప్పటికీ కనపడని పరిస్థితి తెలంగాణా రాష్ట్రంలో ఏర్పడింది. నీళ్ళు కూడా కనపడని పరిస్థితి ఏర్పడింది.

ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం, సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, సాధ్యాసాధ్యాల మీద అధ్యయనాలు లేకుండా నేరుగా నిర్మాణం చేపట్టడం. రాజకీయ, ఆర్థిక లబ్ది కోసం చేపట్టిన ప్రాజెక్ట్‌‌‌‌లు పూర్తి చేయటానికి ఎక్కువ సమయం పట్టటానికి, ఖర్చు ఎక్కువ కావడానికి కారణం అధ్యయనం లేకుండా చేపట్టినందుకే. ఇది చెప్పకుండా పర్యావరణ అనుమతుల వల్ల, భూసేకరణ వల్ల ఆలస్యం అయిందని ప్రచారం చేస్తారు.

నిందలు రైతుల మీద వేస్తారు. గత 10 ఏండ్లలో, అంతకు మునుపు, నీటి ప్రాజెక్టుల మీద ఖర్చుకు వెనుకాడకుండా భారీగా ఖర్చు చేసిన ప్రభుత్వం వాటి నుంచి వచ్చిన, లేదా తీసుకున్న ఫలితాలు, రాబడి, లాభం, ప్రయోజనాల మీద మాత్రం కాకి లెక్కలు చెబుతుంది. వీటి మీద సమీక్ష లేదు. అంచనాలు లేవు. అధ్యయనాలు అసలే లేవు. కేవలం డొల్ల మాటలు, సొల్లు ఉపన్యాసాలు, డాంబీకం తప్పితే పనికొచ్చే ప్రణాళికలు మాత్రం శూన్యం. 

నీటిని ఆపుకుని, నింపుకునే సహజ వ్యవస్థలను నాశనం చేసి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి పెద్ద ఆనకట్టలు కడితే ఫలితం శూన్యం. ఉన్నది పోయింది. కట్టినదానికి శక్తి, సామర్థ్యం లేకపాయే. వర్షం నీరు నేలలో, మట్టిలో, పచ్చదనంలో, గుట్టలలో, వంకర్ల వాగులలో, కుంటలలో, భూగర్భంలో దాచుకునే శక్తి ప్రకృతి వ్యవస్థలో భాగం. ఇవన్నీ దాటినాకనే నీరు నదిలోకి వచ్చేది.

ఈ సహజ వ్యవస్థలను నాశనం చేయడం వల్ల నదిలోకి వరద నీరు వేగంగా చేరుతున్నది. ఈ ప్రవాహ వేగానికి నదిలో ఎంత పెద్ద ఆనకట్ట కట్టినా పరిమాణానికి తలవంచి నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఏ యేటికా ఏడు ఇది ఇంకా దిగజారుతున్నది. నదులలో నీటి ప్రవాహ వేగం పెరగడానికి కారణం వర్షపు నీటిని నెమ్మది చేస్తూ, నిలువలు పెంచే సహజ ప్రకృతి వ్యవస్థలు నాశనం కావడమే. నదీ పరివాహక ప్రాంతంలో వర్షపు నీటిని ప్రాథమిక దశలోనే ఆపుకునే ప్రకృతి వ్యవస్థల మీద పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడని ప్రభుత్వాలు పెద్ద ఆనకట్టలను అప్పులు చేసి అయినా కట్టడానికి కృత నిశ్చయం చూపుతున్నాయి. ప్రజలను మభ్యపెడుతున్నాయి. 

నీటి భద్రత డోలాయమానం

సాగు నీటి ప్రాజెక్టులు నీటి విధానం మీద ఆధారపడి ఆలోచించాలి. ఒక సమగ్ర విధానం లేకుండా, శాస్త్రీయ అధ్యయనాలు లేకుండా, పారదర్శక చర్యలు చేపట్టకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడుతున్న ప్రాజెక్టులు అటు నీటి కరువును తీర్చలేకపోగా, అవసరమైన చర్యల మీద ఖర్చు పెట్టాల్సిన నిధులను హరిస్తున్నాయి. ఫలితంగా కట్టినా కట్టకున్నా నీటి లభ్యత మాత్రం పెరగడం లేదు.

నీటి భద్రత డోలాయమాన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. నీరు పాయె, నిధులు పాయె, మిగిలింది కరువు. ఇప్పటికైనా సమగ్ర ఆలోచన చాల అవసరం. నీటి లభ్యత పెంచాలన్నా, వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నా తక్కువ ఖర్చుతో, చిన్న ప్రాజెక్టులతో, ఉన్న ప్రాజెక్టుల పూర్తి ఉపయోగంతో కూడిన ప్రభుత్వ విధానం తెలంగాణాలో రూపొందించాలి. పర్యావరణ అనుకూల పద్దతులతో సుస్థిర నీటి వ్యవస్థ నిర్మాణం చెయ్యాలి. ప్రజలతో, నిపుణులతో పారదర్శక చర్చలు జరిపి దీర్ఘకాలిక, విస్తృత, లోతైన ప్రణాళికలు తయారు చెయ్యాలి.

 దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​

  • Beta
Beta feature