ప్రముఖ సాహితీవేత్త వెలపాటి రామిరెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం

 ప్రముఖ సాహితీవేత్త వెలపాటి రామిరెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ పద్యకవి, ప్రభుత్వ విశిష్ట పురస్కార గ్రహీత వెలపాటి రామరెడ్డి (89) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన నిన్న హన్మకొండలో తుదిశ్వాస విడిచారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగుల గ్రామానికి చెందిన వెలపాటి రామిరెడ్డి అధ్యాపకుడిగా పనిచేశారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో తనలోని పద్యకవిని నిద్రలేపి పోరాట యోధులను కార్యోన్ముఖులుగా ఉత్తేజం కలిగించి తనవంతు కీలకపాత్ర పోషించారు. ఆయన రచనలను ఏడో తరగతితోపాటు ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల్లోనూ చోటు కల్పించాడు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్ ఆయనను ఘనంగా సత్కరించారు. 
సీఎం కేసీఆర్ సంతాపం
సాహితీవేత్త వెలపాటి రామిరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వ్యవసాయం, రైతు సమస్యలను తన కవిత్వం ద్వారా ఆవిష్కరించిన రైతుకవి వెలపాటి అని సిఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ వస్తువును కవిత్వాంశంగా చేసుకొని రచనా వ్యాసాంగాన్ని సాగించిన వెలపాటి మరణంతో, తెలంగాణ ఒక ఉత్తమ సాహితీవేత్తను కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. దివంగత వెలపాటి రామరెడ్డి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.