ఏడుపాయల జాతరకు పక్కాగా ఏర్పాట్లు

ఏడుపాయల జాతరకు పక్కాగా ఏర్పాట్లు
  • ఆఫీసర్లకు కలెక్టర్​ ఆదేశం

పాపన్నపేట, వెలుగు :  ఏడుపాయల జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని మెదక్​ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్​ కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, ఆర్డీఓ సాయి రామ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, సంబంధిత అధికారులతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ నీరు కలుషితం కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు. 10న ట్రయల్​గా నీటిని వదలాలని, తిరిగి జాతర కోసం 15న 0 .450 టీఎంసీల నీటిని వదలాలని సూచించారు. పోతంశెట్టిపల్లి వద్ద ట్రాఫిక్​ నియంత్రణ, ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు,  రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలన్నారు. చౌరస్తా వద్ద ప్రభుత్వ అసైన్ ​ల్యాండ్ ను గుర్తించి శాశ్వత ప్రాతిపదికన దేవాదాయ శాఖ ద్వారా బస్టాండ్​ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోతంశెట్​పల్లి  వైపు బస్టాండ్ వద్ద భక్తులు వేచి ఉండేందుకు షామియానాలు, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ వాహనాలు జాతరలోకి అనుమతించొద్దని, వీఐపీ వాహనాలకు  ప్రత్యేక పాస్ లను  కేటాయించాలని సూచించారు. పారిశుధ్య కార్మికులను సరిపడా ఏర్పాటు చేసుకొని చెత్త సమస్య లేకుండా చూడాలన్నారు. మూడు బ్రిడ్జిల వద్ద  పోలీసులు, గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ఐదు ప్రథమ చికిత్స కేంద్రాలను, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం వన దుర్గాభవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ పాలక మండలి చైర్మన్ బాలా గౌడ్, ఈవో శ్రీనివాస్  పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈఈ  శ్రీనివాస్, డీపీవో సాయిబాబా,  పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ  పాండురంగారెడ్డి, మిషన్ భగీరథ అధికారి కమలాకర్ , మత్స్య శాఖ సహాయ సంచాలకులు డాక్టర్​ రజని, మెదక్​ డీఎస్పీ సైదులు, తహసీల్దార్లు  మహేందర్,  చంద్రశేఖర్ పాల్గొన్నారు. 

సమస్యల పరిష్కారానికి చర్యలు

మెదక్​టౌన్, వెలుగు :  మెదక్ ​నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్​రాజర్షి షాను కలిసి ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు శుక్రవారం విన్నవించారు. కలెక్టర్​గా కొత్తగా వచ్చిన రాజర్షి షాను ఆయన చాంబర్​లో మర్యాదపూర్వకంగా కలిసి ఏడుపాయల వద్ద వసతుల కొరత, పెండింగ్​లోని కలెక్టరేట్​భవన నిర్మాణ పనులు, తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్​ను కలిసినవారిలో మెదక్​మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు మల్లప్ప, ఏడుపాయల మాజీ చైర్మన్​నర్సింలుగౌడ్​, నాయకులు సురేందర్​గౌడ్, మెదక్​ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి అఫ్జల్​ 
ఉన్నారు.