బీహార్‌‌లో కరెంట్ లొల్లి..పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

బీహార్‌‌లో కరెంట్ లొల్లి..పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

పాట్నా: బీహార్‌‌లో కరెంట్ కోతలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినవారిపై పోలీసులు బుధవారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ సక్రమంగా సరఫరా చేయకపోవడం, విద్యుత్ చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ బార్ సోయ్ సిటీ సమీపంలోని కతిహార్ గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. విద్యుత్ శాఖ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే కొంత మంది వ్యక్తులు కరెంట్ ఆఫీసుపైకి రాళ్లు రువ్వారు. దాంతో  పోలీసులు లాఠీఛార్జి చేశారు.
 

అయినా పరిస్థితులు అదుపులోకి రాకపోవటంతో కాల్పులు జరిపారు. కాల్పు ల్లో ఒకరు చనిపోయారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఆందోళనకారులు విద్యుత్ శాఖ కార్యాలయాన్ని రాళ్లతో ధ్వంసం చేశారని తెలిపారు. విద్యుత్ శాఖకు చెందిన 12 మంది అధికారులు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను అదుపు చేసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. కాల్పు ల్లో మృతి చెందిన వ్యక్తిని మహ్మద్ ఖుర్షీద్ (35)గా గుర్తించామన్నారు. కరెంట్ కోతల నిరసన హింసాత్మకంగా మారడంతో నితీశ్​ సర్కార్​పై బీజేపీ మండిపడింది. బీహార్ 
ప్రతిపక్ష నాయకుడు విజయ్ సిన్హా, మాజీ ఉప ముఖ్యమంత్రి తారాకిశోర్ ప్రసాద్ కూడా 
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.