అయ్యప్ప స్వామి భక్తుల నిరసన : వికారాబాద్​ జిల్లా పరిగిలో ఘటన

అయ్యప్ప స్వామి భక్తుల నిరసన : వికారాబాద్​ జిల్లా పరిగిలో ఘటన

వికారాబాద్ జిల్లా పరిగిలో అయ్యప్ప స్వామి భక్తుల నిరసన చేపట్టారు. అయ్యప్ప స్వాములను కించపరిచేలా మాట్లాడిన ఓ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై అయ్యప్ప స్వామి భక్తులు పరిగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిందూ దేవుళ్ళను కించపరుస్తూ అయ్యప్ప స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన అతనిపై చర్యలు తీసుకోవాలని పరిగి పోలీసు స్టేషన్ వద్ద అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళన చేపట్టారు. .

రెండు రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ సభలో ఓ వ్యక్తి అయ్యప్ప స్వాములను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని.... అతన్ని వెంటనే అరెస్టు చేసి, పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసులను అయ్యప్ప స్వాములు కోరారు. హిందూ దేవుళ్ళను తిడితే తొందరగా పబ్లిసిటీ కావచ్చని కొందరు ఈ మధ్య ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని భక్తులు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే హిందూ సమాజం ఏకం కావాలని కోరారు.

అయ్యప్ప స్వాములను కించపరుస్తూ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుండడంతో మరి కొన్ని చోట్ల కూడా అయ్యప్ప స్వాములు ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగా ఆదిలాబాద్ ఇచ్చోడలోని అంబేద్కర్ చౌక్ వద్ద అయ్యప్ప భక్తులు రోడ్డు పైకి వచ్చి నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ ముందు అయ్యప్ప స్వాముల ధర్నా చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణ జాతీయ రహదారిపై అయ్యప్ప స్వాముల ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే వరంగల్ పట్టణంలోనీ ఓ సభలో అయ్యప్ప స్వామిని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ నేపథ్యంలో అయ్యప్ప  స్వాములు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టి, పోలీసులకు పిర్యాదు చేశారు.