ఈటెల కాన్వాయ్ పై దాడిని నిరసిస్తూ బీజేపీ ఆందోళనలు

ఈటెల కాన్వాయ్ పై దాడిని నిరసిస్తూ బీజేపీ ఆందోళనలు

మునుగోడు నియోజకవర్గంలోని పలివెల గ్రామంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ బీజేపీ మండల అధ్యక్షుడు చిటికెల వెంకటయ్య ఆధ్వర్యంలో పెద్ద షాపూర్ జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ తర్వాత ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

నిజాంపేట్ లో నిరసనలు

నిజాంపేట్ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో బాచుపల్లి చౌరస్తాలో టీఆర్ఎస్ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఈటెల రాజేందర్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు. తమ పార్టీ నాయకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్ పట్టణంలో ఆందోళనలు

ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ లో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

* ఘట్ కేసర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఘట్ కేసర్ మండలం బీజేపీ అధ్యక్షుడు ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. 

* ఈటెల కాన్వాయ్ పై జరిగిన దాడిని నిరసిస్తూ.. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. 

* ఇటు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. 

* కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేసి, నిరసన తెలియజేశారు. 

* మునుగోడులో ఈటల రాజేందర్ కాన్వాయ్ పై దాడిని నిరసిస్తూ హుజురాబాద్ లో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

* జగిత్యాల జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. 

* ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై దాడికి నిరసనగా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లిలో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

* జనగామ జిల్లా : జనగామ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు.

* రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ మల్లారెడ్డి, కార్పొరేటర్ సంగీతతో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 

అసలేం జరిగిందంటే..? 
మునుగోడు మండలం పలివెలలో ప్రచారానికి వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై మంగళవారం మధ్యాహ్నం టీఆర్​ఎస్​ కార్యకర్తలు రాళ్లు, కట్టెలతో దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆయన గన్ మన్, పీఆర్వోతోపాటు పలువురు అనుచరులు తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ ఎన్నికల ప్రచార రథంతోపాటు  కాన్వాయ్ లోని ఆరు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. 

గ్రామస్తులతో మాట్లాడుతుండగా..!
ఉప ఎన్నిక ప్రచారానికి చివరి రోజు కావడంతో తన తల్లిగారి ఊరైన పలివెలలో ఈటల భార్య జమున మహిళలతో కలిసి మంగళవారం ఉదయం ప్రచారం ప్రారంభించారు. పలివెల సెంటర్ లో ముగింపు సమావేశం కోసం రెండు రోజుల ముందే బీజేపీ నాయకులు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. ఈ మీటింగ్ కు చీఫ్ గెస్ట్ గా ఈటల హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయన తన కాన్వాయ్ తో పలివెలకు చేరుకున్నారు.

ఊరిలోకి ఎంటర్ అయ్యాక ర్యాలీ నిర్వహించారు. తర్వాత గ్రామస్తులను ఉద్దేశించి ఈటల మాట్లాడుతుండగా.. అప్పటికే అక్కడికి కేటీఆర్ రోడ్డు షోలో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలతో చేరుకున్నారు. ఈటల ప్రసంగానికి ఆటంకం కలిగించేలా టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ప్రతిగా నినాదాలు చేయగా.. టీఆర్ఎస్ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి జెండా కట్టెలు, రాళ్లతో  దాడికి దిగారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి.