పీస్ డీల్పై ఇరాన్ లో నిరసనలు..విదేశాంగ శాఖ ఆఫీసు ముందు జనం ఆందోళన

పీస్ డీల్పై ఇరాన్ లో నిరసనలు..విదేశాంగ శాఖ ఆఫీసు ముందు జనం ఆందోళన

టెహ్రాన్: అమెరికా– ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తుండగా ఇరాన్ లో మాత్రం నిరసన వ్యక్తమవుతోంది. పీస్ డీల్ పేరుతో తమ దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తున్నారని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. అమెరికా డిమాండ్లకు తలొగ్గారంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అరాఘ్చీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ శనివారం మాషద్ లోని విదేశాంగ శాఖ ఆఫీసు ముందు అతివాదులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అరాఘ్చీ చొరబాటుదారుడని విమర్శిస్తూ ‘డెత్ టు అరాఘ్చీ’ అంటూ నినదించారు. దేశ రాజధాని టెహ్రాన్​లోనూ భారీ ఎత్తున జనం నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

అరాఘ్ఛీతో పాటు అమెరికాతో పీస్ డీల్ చర్చల్లో పాల్గొంటున్న స్పీకర్ మొహ్మద్ బాఘెర్ ఖాలిబాఫ్​ కూడా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. శాంతి ఒప్పందానికి సంబంధించి అమెరికా విధించిన షరతులు ఇరాన్ కు తీవ్ర నష్టం చేకూరుస్తాయని, హార్మూజ్ జలసంధిపై తమ పట్టు పోతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.