ఆఫీసర్లు చెక్కులు పంపిణీ చేయడంపై శంషాబాద్ మున్సిపల్ వైస్​ చైర్మన్ ఆగ్రహం

ఆఫీసర్లు చెక్కులు పంపిణీ చేయడంపై శంషాబాద్ మున్సిపల్ వైస్​ చైర్మన్ ఆగ్రహం

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిషత్ ఆఫీస్​వద్ద శుక్రవారం నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. ప్రజాప్రతినిధులు రాక ముందే ఆఫీసర్లు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ సుష్మ, ఆర్డీవో శశికళ సమక్షంలో ఆఫీసర్లను నిలదీశారు. గతంలోనూ ఇలాగే చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆయనకు సర్దిచెప్పి, మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ఆర్డీవోకు సూచించారు.

డీసీఎం డ్రైవర్​పై బీఆర్ఎస్ నేతల దాడి

ప్రొటోకాల్ వివాదానికి ముందు శంషాబాద్ ఎంపీడీవో ఆఫీసు వద్ద బీఆర్ఎస్ నేతలు ఓ డీసీఎం డ్రైవర్​పై దాడి చేశారు. సంక్షేమ సంబురాల కార్యక్రమానికి హాజరైన శంషాబాద్ మున్సిపల్ కమిషనర్​భోగేశ్వర్లు కారును ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో రోడ్డు పక్కన పార్క్​చేశారు. అదే రూట్​లో వెళ్తున్న ఓ డీసీఎం.. కమిషనర్​కారును పక్క నుంచి తాకుతూ వెళ్లింది. దీంతో కారు డ్రైవర్.. డీసీఎం డ్రైవర్​తో గొడవపడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బీఆర్ఎస్​ నేతలు డీసీఎం డ్రైవర్​పై దాడిచేసి కొట్టారు.