రైతువేదికల సాక్షిగా ప్రొటోకాల్​ రగడ

రైతువేదికల సాక్షిగా ప్రొటోకాల్​ రగడ

నిజామాబాద్​, వెలుగు : రాష్ట్రంలో నిర్మించిన రైతువేదికలపై బీజేపీ, టీఆర్​ఎస్​ల మధ్య ప్రొటోకాల్​ వివాదం రగులుతోంది. వేదికల నిర్మాణాలకు సెంట్రల్​గవర్నమెంట్  ఫండ్స్​ వాడుకుంటున్నా ఎక్కడా ఆ విషయాన్ని  స్టేట్​ గవర్నమెంట్​ చెప్పడంలేదు. పైగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని, ప్రొటోకాల్​ ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొవిడ్​ వ్యాక్సిన్​ను పూర్తిగా  కేంద్రమే ఉచితంగా అందిస్తోంది. పేదలకు గరీబ్​ కళ్యాణ్​ యోజన పేర ఉచితంగా రేషన్​ సప్లై చేస్తున్నది. స్టేట్​ గవర్నమెంట్​ గొప్పగా చెప్పుకుంటున్న డబుల్ బెడ్​రూం స్కీమ్​కు  కూడా సెంట్రల్​ ఫండ్స్​  ఇస్తోంది. ఇలా అనేక స్కీమ్​లలో  సెంట్రల్​ గవర్నమెంట్​ వాటా ఉన్నా ఎక్కడా కేసీఆర్​ సర్కారు ఆ విషయాన్ని చెప్పకుండా ఇవన్నీ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటోంది. ఈ విషయంలో బీజేపీ అనేక సందర్భాల్లో నిరసన ప్రకటించింది. స్టేట్​ గవర్నమెంట్​ మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సెంట్రల్​గవర్నమెంట్ ఫండ్స్​ ఇస్తున్న స్కీమ్​లకు క్రెడిట్ ​ఇవ్వాల్సిందేనని అంటోంది. 

రైతువేదికలకు సెంట్రల్​ ఫండ్స్​రూ. 60 కోట్లు

తాజాగా  రైతువేదికలకు సంబంధించి బీజేపీ ఆందోళన బాట పట్టింది.  క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించారు. ఇందుకు ఉపాధిహామీ పథకం నుంచి ఫండ్స్​వాడుకున్నారు. నిజామాబాద్​, కరీంనగర్​, ఆదిలాబాద్​ లోకసభ నియోజకవర్గాల నుంచి బీజేపీ మెంబర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పరిధిలో మొత్తం 566 రైతు వేదికలను కేసీఆర్​ ప్రభుత్వం నిర్మించింది. నిజామాబాద్​ లోకసభ పరిధిలో మొత్తం 177 వేదికలు నిర్మించగా  నిజామాబాద్​ జిల్లాలో 106, జగిత్యాల జిల్లాలో  71 ఉన్నాయి. ఆదిలాబాద్​ లోకసభ పరిధిలో 243 రైతువేదికలు కట్టారు. ఇందులో ఆదిలాబాద్​ జిల్లాలో 101,  నిర్మల్​ జిల్లాలో 72,  ఆసిఫాబాద్​ జిల్లాలో 71 వేదికలు నిర్మించారు. కరీంనగర్​పరిధిలో 143 వేదికలు నిర్మించగా.. 75 కరీంనగర్​ జిల్లాలో, 71 సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉన్నాయి.  ఒక్కో రైతువేదికను రూ. 22 లక్షలతో కడుతుండగా, ఇందులో రూ. 10 లక్షలు కేంద్రం వాటా. ఈ లెక్కన మూడు లోకసభ సెగ్మెంట్ల పరిధిలో రూ. 60.30 కోట్ల సెంట్రల్​ ఫండ్స్​ వాడుకున్నారు. అయితే రైతువేదికల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఎంపీలను మొక్కుబడిగా ఆహ్వానిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇన్విటేషన్​ పంపి చేతులు దులుపుకుంటున్నారు. ఎంపీలు ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు, పార్లమెంట్​ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శిలాఫలకాల మీద తమ పేర్లున్నా ..   ఎంపీలు మాత్రం ప్రారంభోత్సవాలకు అటెండ్​ కాలేకపోతున్నారు.  ప్రొటోకాల్​ ప్రకారం ఎంపీలు పాల్గొన్నప్పుడే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని బీజేపీ  నేతలు అంటున్నారు. రైతువేదికల మీద సీఏం కేసీఆర్​తోపాటు లోకల్​ ఎమ్మెల్యే ఫొటో పెడుతున్నారు. సగం ఫండ్స్​సెంట్రల్​ నుంచే వాడుకుంటున్నా  ప్రధాని మోడీ ఫొటో ఏర్పాటు చేయడం లేదని బీజేపీ లీడర్లు విమర్శిస్తున్నారు.   

ఖాకీ పహారాలో ఓపెనింగ్స్​..

ఇటీవల బీజేపీ క్యాడర్​ నుంచి నిరసనలు పెరగడంతో పోలీసుల పహారా నడుమ రైతువేదికల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. వేదికల మీద  ప్రధాని , ఎంపీల ఫోటోలు పెట్టాలని డిమాండ్​ చేస్తూ కొన్ని చోట్ల ప్రారంభోత్సవాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బందోబస్తు పెంచడంతో పాటు ఆ ఏరియాల్లో బీజేపీ లీడర్లను  ముందస్తుగా అరెస్ట్​ చేస్తున్నారు. నిజామాబాద్​ జిల్లా నందిపేటలో బీజేపీ లీడర్లను ముందుగానే అరెస్టు చేసి.. భారీగా పోలీసు బలగాలను దింపి సోమవారం  రైతువేదికను  ప్రారంభించారు. 

ఆఫీసర్లు ప్రొటోకాల్​ పాటించాలె

 ఆఫీసర్లు పక్షపాతం లేకుండా పని చేయాలే. రానున్నది బీజేపీ  ప్రభుత్వమేనని గుర్తు పెట్టుకోవాలే. అరెస్టులు చేస్తే  ఉద్యమంఉప్పెనలా మారుతుంది. ఎంపీలకు సంబంధించి ప్రొటోకాల్​పాటించకపోతే సెంట్రల్​గవర్నమెంట్ యాక్షన్​ ఉంటుంది. కేంద్రప్రభుత్వ నిధులను వాడుకుంటూ ప్రధానిని విస్మరించడం తగదు.
- నిజామాబాద్​ ఎంపీ అర్వింద్ 

ప్రధాని, ఎంపీ ఫొటో పెట్టాలి

రైతువేదికల మీద ప్రధాని మోడీ,  ఎంపీ అర్వింద్​ఫోటోలను ఏర్పాటు చేయాలి. కేంద్ర నిధులు వాడుకుంటున్నా ఆ క్రెడిట్​ ఇవ్వడంలేదు. ప్రొటోకాల్​ పాటించకపోతే స్టేట్​ గవర్నమెంట్​కు వ్యతిరేకంగా పోరాడుతాం. ఎంపీ ఫోటో ఏర్పాటు చేసేదాక అధికారులపై ఒత్తిడి తెస్తం.
- వినయ్​రెడ్డి , ఆర్మూర్​ బీజేపీ ఇన్​చార్జి​