కారుణ్య నియామకం కింద​ ఉద్యోగమిచ్చి ఆదుకోండి

కారుణ్య నియామకం కింద​ ఉద్యోగమిచ్చి ఆదుకోండి
  •  రైల్వే అధికారులకు యువకుడి వేడుకోలు

సికింద్రాబాద్​, వెలుగు : విధి నిర్వహణలో మరణించిన తన తండ్రి స్థానంలో డిపెండెంట్ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన బానోతు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. బుధవారం రైల్​ నిలయానికి వచ్చి అధికారులను కలిసి విజ్ఞప్తి చేస్తే తన బాధను పట్టించుకోలేదన్నారు. రైల్​ నిలయం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన తండ్రి బానోతు చిన్నకోటి రైల్వేలో గ్యాంగ్​మెన్ గా పని చేస్తూ 2020 సెప్టెంబర్​ 17న రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిపారు. ఆయన పెద్ద కొడుకును అయిన తనకు కాంపాషనేట్ గ్రౌండ్​కింద ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు.

తాను పదో తరగతి మాత్రమే పాస్​ అయ్యాయని, ప్రస్తుతం వ్యవసాయ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని వివరించారు. రైల్వే జీఎం తమ విజ్ఞప్తిని తిరస్కరించారని, తమ కుటుంబం ఆర్థికంగా బాగున్నదని, ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారని తెలిపారు. తమ వాస్తవ పరిస్థితిని తెలుసుకొని కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే ఉన్నతాధికారులు తమపై నిర్దాక్షిణ్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని అర్థం కావడం లేదని, ఎన్నిసార్లు కలిసినా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా తమ గోడు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.