- పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ–2003 టీచర్లకు తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, టీచర్ల పెండింగ్ బిల్లులన్నింటినీ వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జెడ్పీ ఆఫీసులో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్లు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వాన్ని వీడాలన్నారు.
టీచర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ తేల్చి ప్రతినెలా ప్రమోషన్లు కల్పిస్తూ.. ప్రతి వేసవిలో బదిలీలు చేపట్టేందుకు ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళా ఉద్యోగులు ఉపయోగించుకునే చైల్డ్ కేర్ లీవులపై ఉన్న వయోపరిమితి ఆంక్షలను వెంటనే ఎత్తివేసి, సర్వీసులో ఎప్పుడైనా వాడుకునేలా సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని చెన్నయ్య డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రావు, మహిళా అధ్యక్షురాలు కృష్ణప్రియ పాల్గొన్నారు.
