పబ్జీ కోసం ఓ మనవడు తన 65ఏళ్ల తాత కొంపముంచాడు. పబ్జీ ఆడేందుకు వెయ్యి కాదు రెండు వేలు కాదు సుమారు రూ.2,34,49 తన తాత అకౌంట్ నుంచి ట్రాన్స్ ఫర్ చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీ తిమార్ పూర్ కు చెందిన 15ఏళ్ల బాలుడికి పబ్జీ అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే తన తాతకు తెలియకుండా మార్చి 7 నుంచి మే 8 మధ్యకాలంలో డెబిట్ కార్డ్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేశాడు.
ఈ నేపథ్యంలో బాధితుడు తన అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ ఫర్ అవ్వడంపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో మనవడు పబ్జీ గేమ్ లో ఎస్ ర్యాంక్ చేరుకునేందుకు తన తాత డెబిట్ కార్డ్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేసినట్లు గుర్తించారు.
ఇలా మూడునెలల కాలంలో బాలుడు సుమారు రూ.2లక్షలకు పైగా డబ్బుల్ని పేటీఎం ద్వారా ట్రాన్స్ ఫర్ చేశాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆంటో అల్ఫోన్స్ తెలిపారు. అంతేకాదు బాలుడు పబ్జీ ఎస్ ర్యాంక్ చేరుకున్న తరువాత పబ్జీ అకౌంట్ ను బ్లాక్ చేసినట్లు గుర్తించామని వెల్లడించారు.
బాధితుడి డెబిట్ కార్డ్ నుంచి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యే సమయంలో వచ్చే ఓటీపీ కోసం తన తాత మొబైల్ తీసుకునే వాడని, ఓటీపీ నెంబర్ యాడ్ చేసి ఆ డీటెయిల్స్ డిలీట్ చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. డెబిట్ కార్డ్ నుంచి ట్రాన్స్ ఫర్ చేసిన పేటీఎం నెంబర్ ఎవరిదనే విషయంపై ఆరా తీస్తున్నట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆంటో అల్ఫోన్స్ చెప్పారు.
