మరో రెండు గ్యారంటీల అమలుకు ఏర్పాట్లు స్పీడప్

మరో రెండు గ్యారంటీల అమలుకు ఏర్పాట్లు స్పీడప్

హైదరాబాద్, వెలుగు: కొత్తగా అమలు చేయబోయే మరో రెండు గ్యారంటీలకు ఎంతమంది అర్హులు అనే దానిపైనా రాష్ట్ర సర్కార్ లెక్కలు రెడీ చేస్తున్నది. రూ.500కే గ్యాస్ సిలిండర్​తో పాటు 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్ కు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో అమలును ప్రకటించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. దీంతో లబ్ధిదారుల డేటాపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉచిత విద్యుత్ కోసం గృహజ్యోతి కింద 81.54 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిని విద్యుత్ శాఖ డిపార్ట్​మెంట్ నుంచి గృహ విద్యుత్ వినియోగదారుల లెక్కలతో సరిచూస్తున్నారు.

ఇక రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కింద 91.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఆరు సిలిండర్లు ఇస్తే రూ.2,200 కోట్లకుపైగా ప్రభుత్వంపై భారం పడుతుంది. ఈ సమాచారాన్ని సివిల్ సప్లయ్స్ డిపార్ట్​మెంట్ తో పాటు గ్యాస్ కంపెనీల నుంచి గృహ వినియోగదారుల లెక్కలు తీసుకుంటుంన్నది. వీటిని ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల సమాచారంతో సరిపోలుస్తున్నారు.​ అందులో నుంచి తరువాత ఈ రెండింటికి సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఫీల్డ్ వెరిఫికేషన్​తో ఫైనల్ చేయనున్నారు.

41 లక్షల అప్లికేషన్లలో రేషన్.. ఆధార్ నంబర్లు తప్పుగా ఎంట్రీ

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్‌‌ ప్రకటించింది. ఇందులో మొదటిదైన మహాలక్ష్మి పథకంలో మూడు హామీలు ఉండగా.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేసింది. ఆరో గ్యారంటీలోని చేయూత కింద రూ.పది లక్షల రాజీవ్‌‌ ఆరోగ్యశ్రీ బీమా అమలు చేసింది. మిగిలినవి అమలు చేయాల్సి ఉంది.

ఐదు గ్యారంటీల అమలుకు ఇటీవల ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది.  మొత్తం 1కోటి 9 లక్షల అప్లికేషన్లు  వచ్చాయి. ఇందులో రేషన్ కార్డు నెంబర్​, ఆధార్ కార్డు నంబర్లు సరిగా ఉన్నవి 64.58 లక్షలు ఉన్నట్లు తేల్చారు. అదే సమయంలో రేషన్ కార్డు, ఆధార్ నంబర్లు తప్పుగా నమోదైన అప్లికేషన్లు 41.60 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటి ఫీల్డ్​ వెరిఫికేషన్​లో సరిచేయాలని నిర్ణయించారు. మహాలక్ష్మి కింద మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఇచ్చే పథకానికి 92.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకానికి 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రైతు భరోసా కౌలు రైతులకు 2.63 లక్షలు, ఉద్యమ అమరుల కుటుంబాలకు 250 గజాల స్థలం కోసం 23,794, ఉద్యమకారులకు 250 గజాల స్థలం కోసం 84,659 అప్లికేషన్లు వచ్చాయి.