
- ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకా?
- రైతులకు బేడీలు వేసి జైలుకు పంపినందుకా?
- ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ప్రశ్న
ఖైరతాబాద్, వెలుగు: వరంగల్‌లో నిర్వహించబోతున్న బీఆర్ఎస్రజతోత్సవ సభ దేనికోసమో మాజీ సీఎం కేసీఆర్సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకా? లేక అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందరి టెలిఫోన్లను ట్యాప్చేసినందుకా? ధరణి పేరుతో భూములు దోచుకున్నందుకా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గజ్జెల కాంతం మీడియాతో మాట్లాడారు. వరంగల్సభతో కేసీఆర్ ఏమి చెప్పాలనుకుంటున్నారో తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇవ్వకుండా, పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా.. రైతుల చేతులకు బేడీలు వేయించినందుకా?వరంగల్సభ అంటూ నిలదీశారు. అస్సలు ఆ పార్టీ పేరు బీఆర్ఎస్సా.. టీఆర్ఎస్సా.. జాతీయ పార్టీనా.. ప్రాంతీయ పార్టీనా అంటూ ఎద్దేవా చేశారు. దళితుడిని సీఎం చేస్తానని పదేండ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్.. కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని విమర్శించారు. తెలంగాణ రాక ముందు కేసీఆర్కుటుంబ సభ్యులకు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం విచారణ జరపాలన్నారు.