ప్రజాపాలన అందిస్తం.. బీఆర్ఎస్​ సర్కారు లెక్క ఫోన్​ ట్యాపింగ్​ చెయ్యం : సీఎం రేవంత్

ప్రజాపాలన అందిస్తం.. బీఆర్ఎస్​ సర్కారు లెక్క ఫోన్​ ట్యాపింగ్​ చెయ్యం : సీఎం రేవంత్
  • ఎన్నికల కోడ్ వల్ల ఫోన్​ట్యాపింగ్​పై రివ్యూ చేయలే 
  • స్ట్రిక్ట్​ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నరు.. నా ప్రమేయం అవసరం లేదు
  • పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా
  • ఫోన్ ట్యాపింగ్​పై  సీబీఐ దర్యాప్తునకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు  ఎందుకు డిమాండ్ చేయట్లేదు?
  • పోరాటాలు, త్యాగాలు స్ఫురణకు వచ్చేలా రాష్ట్ర చిహ్నం, గీతం 
  • వాటిని రూపొందించే బాధ్యతను కవి, కళాకారులకే వదిలేశా
  • ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్​చాట్​

న్యూఢిల్లీ, వెలుగు: తాము గత బీఆర్ఎస్​ సర్కారులాగా ఫోన్​ ట్యాపింగ్​చేయబోమని, ప్రజాపాలన అందించడంపైనే దృష్టిపెడతామని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలిపారు. స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఈ కేసు విచారణ చేపడుతున్నారని, ఇందులో తన ప్రమేయం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ విషయంపై సీఎం హోదాలో ఎలాంటి సమీక్షా సమావేశం నిర్వహించలేదని చెప్పారు.

 ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ విచారణ తీరును తాను పట్టించుకుంటే.. సీఎం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఆయుధంగా మలుచుకునే అవకాశం ఉన్నదని చెప్పారు. అన్నింటిపై సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు.. ఫోన్ ట్యాపింగ్​పై మాత్రం విచారణకు ఎందుకు డిమాండ్​ చేయడం లేదని ప్రశ్నించారు. 

మంగళవారం ఉదయం తుగ్లక్ రోడ్​లోని సీఎం అధికారిక నివాసం నిర్మాణ పనులను  మీడియాతో కలిసి సీఎం రేవంత్​ పరిశీలించారు. అనంతరం అక్కడే  మీడియాతో చిట్ చాట్​గా మాట్లాడారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టాక డిసెంబర్​ ఆఖరులో అధికారుల బదిలీలు చేపట్టినప్పుడు ఎస్ఐఐబీలో కంప్యూటర్లు, హార్డ్​డిస్క్​లు, ల్యాప్టాప్స్​ మిస్సింగ్ అయినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారని చెప్పారు. అలా దొంగతనం పేరుతో నమోదైన కేసు.. ఎలా ఫోన్ ట్యాపింగ్ కేసుగా మారిందో వివరించారు.  హార్డ్​డిస్క్​లు, సర్వర్లను ధ్వంసం చేయడంతో మావోయిస్టులు, తీవ్రవాదులకు సంబంధించిన విలువైన సమాచారం పోయినట్టు తెలిసిందని, దీనిపై ఇంకా క్లారిటీ రాలేదని చెప్పారు. 

రాష్ట్రంలో ప్రశాంతంగా పార్లమెంట్​ ఎన్నికలు

రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగాయని రేవంత్​ అన్నారు.  ఎక్కడా ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదని చెప్పారు. అలాగే, కాంగ్రెస్ అధికారం చేపట్టాక రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తలేవని, ఇది తమ పాలన తీరుకు నిదర్శనం అని పేర్కొన్నారు.  పక్క రాష్ట్రం ఏపీలో చాలామంది అధికారులను ఈసీ బదిలీ చేసిందని, తెలంగాణలో ఇలాంటి ఒక్క ఘటన కూడా నమోదు కాలేదని అన్నారు. ఎన్నికల వ్యవహారంలో విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ నేతలనుంచి ఒక్క ఆరోపణ కూడా రాలేదని చెప్పారు. 

 రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. గతంలో 100 యూనిట్ల వినియోగం ఉంటే.. ఇప్పుడు అది 140 యూనిట్లకు పెరిగిందని వెల్లడించారు.  ప్రకృతి వైపరీత్యాలతో చెట్లు వైర్లపై తెగిపడడం, వాడకం పెరగడం వల్ల ట్రాన్స్ ఫార్మర్లపై భారం పెరగడం లాంటి కారణాలతో అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్​కు అంతరాయం ఏర్పడుతున్నదని తెలిపారు. 

తెలంగాణ అంటేనే పోరాటాలు, త్యాగాలు

తెలంగాణ అంటేనే పోరాటాలు, త్యాగాలు అని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఈ గుర్తులే ఇకపై తెలంగాణ చిహ్నం(రాజ ముద్ర) లో ఉంటాయని చెప్పారు. తెలంగాణ అంటే రాజులు, రాచరికాలు గుర్తు రావని, ఆ రాజులకు వ్యతిరేకంగా కొట్లాడిన చరిత్ర తెలంగాణది అని పేర్కొన్నారు. అదే రాచరిక ఆనవాళ్లు చిహ్నంలో ఉంటే పాలకుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

అందుకే కాకతీయ తోరణంతో సహా రాచరికానికి సంబంధించిన గుర్తులేవీ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. పోరాటాలు, త్యాగాలను స్మరించుకునేలా.. రాష్ట్రంలో సమ్మక్క- సారక్క, నాగోబా జాతర, పిల్లల మర్రి లాంటి ఎన్నో చిహ్నాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 న ఆవిష్కరించబోయే అధికారిక రాష్ట్ర చిహ్నంలో ఈ పోరాటాలు, త్యాగాల గుర్తులే ఉంటాయని చెప్పారు. 

మనమేంటో కనిపించేలా రాజముద్ర ఉంటుందని, ఆ చిహ్నం రూపకల్పన బాధ్యతలు కళాకారులకే వదిలేశానని తెలిపారు. తానేమీ 80 వేల పుస్తకాలు చదవలేదని కేసీఆర్​కు పరోక్షంగా చురకలంటించారు. ఇక రాష్ట్ర గీతాన్ని రూపొందించే బాధ్యతలు కవి అందెశ్రీకి వదిలేశానని, మ్యూజిక్ కంపోజింగ్ ఎవరితో చేయించుకుంటారో ఆయన ఇష్టమని చెప్పారు.  కీరవాణి విషయంలో విమర్శలు ఎదుర్కొంటారో లేక సమర్థించుకుంటారో అది అందెశ్రీనే చూసుకుంటారని తెలిపారు. ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించడమే తన కర్తవ్యమని చెప్పారు.

 జూన్ 2 లోపు గీతాన్ని పూర్తి చేయాలని చెప్పానని, ఆయనెలా చేయాలో కూడా తానే చెప్తే అది కాళేశ్వరం స్టోరీగా మారుతుందని అన్నారు. ఫైనల్ జడ్జిమెంట్ అందెశ్రీకి వదిలేశానని, 100 శాతం నిర్ణయాధికారం ఆయనదే అని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం, లోగోను రూపొందించే బాధ్యతలు ఫైన్ఆర్ట్స్ కాలేజీ కి చెందిన వ్యక్తి, నిజామాబాద్ బిడ్డకు అప్పగించినట్టు చెప్పారు.  

విరిగింది కేసీఆర్ పన్నుకాదు..కాళేశ్వరం వెన్నెముక
 
మేడిగడ్డ బ్యారేజీలో జరిగింది కేసీఆర్ 32 పళ్లలో ఒక పన్ను విరిగినట్లు కాదని, మొత్తం ప్రాజెక్ట్ వెన్నెముకనే విరిగిందని రేవంత్​ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ ఎంత అరిచినా.. నిపుణులు సూచనల మేరకే ముందుకెళ్తామని తేల్చి చెప్పారు. అయితే రాజకీయాలకు పోకుండా.. నీళ్లను తాత్కాలికంగా లిఫ్ట్​ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.

 అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీ  గేట్లన్నీ తెరిచిపెట్టాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ) నిపుణులు చెప్పారని, అలాకాకుండా గేట్లు క్లోజ్ చేస్తే బ్యారేజ్ మొత్తం కూలిపోయే పరిస్థితులున్నాయని పేర్కొన్నారని రేవంత్​ చెప్పారు. మేడిగడ్డలో నీళ్లు ఎత్తి అన్నారంలో పోయాలని కేసీఆర్ అంటున్నారని, అన్నారంలో ఉన్న నీళ్లనే సముద్రంలోకి వదిలామని గుర్తు చేశారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోస్తే అన్నారం గేట్లు ఎత్తినందున మళ్లీ మేడిగడ్డకే నీళ్లు చేరుతాయని వివరించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు 30 రోజులు ఎత్తిపోశాక.. 31వ రోజు వర్షం పడితే నీళ్లన్నీ సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ఈ లాజిక్ మిస్​ అయిండని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యాక ఇప్పటి వరకూ 52 టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారని, ఈ నీళ్లను లిఫ్ట్ చేసేందుకు కట్టిన కరెంట్ బిల్లులు మొత్తం సముద్రంలో పోసినట్టుగా మారిందని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకే  జ్యుడీషియల్​ విచారణ  పరిమితం చేసినట్టు చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని తమ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.

 ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను పెంచడంపై దృష్టి పెడితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ముందుకు సాగదని చెప్పారు. విచారణ చేపడితే పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టుల పనులు చేయించలేమని, బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

కేసీఆర్​కు లై డిటెక్టర్ పరీక్ష చేయాలి 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనాలోచితంగా కేసీఆర్ ఎందుకు వ్యవహరించారో లై డిటెక్టర్ పరీక్ష చేస్తే తప్ప అసలు విషయాలు బయటకు రావు. ఈ విషయంపై కేసీఆర్​ను ఇంటరాగేషన్​ చేయాలేమో. ఈ ప్రాజెక్ట్ పై అసెంబ్లీకి వచ్చి చెబుతారేమో అనుకుంటే కేసీఆర్​ రావట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జియో ఫిజికల్, జియో టెక్నికల్ సర్వేలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఆ టెస్టులు చేసే సామర్థ్యం ఉన్న రెండు ఏజెన్సీలను సంప్రదించాం. మట్టి నాణ్యతా పరీక్షలు కూడా వేరే దగ్గర చేసి, ప్రాజెక్టు వేరే చోట కట్టారు. 

ఈ విషయాలేవీ రికార్డుల్లో లేవు. ఈఎన్సీ మురళీధర్​రావు పోతూపోతూ ఫైల్స్, ఇతర ఆధారాలను పట్టుకెళ్లాడు. ఇంకేమైనా ఉంటే ఆయన మనుషులతో తెప్పించుకుంటున్నడు. సంబంధిత ఫైళ్లను చింపివేయాలని చెబుతున్నడు. తప్పు జరిగిందని చర్యలు తీసుకోబోతే ఇంజినీరింగ్ శాఖలోని ఆఫీసుర్లు ఒకరినొకరు కాపాడుకుంటున్నరు.
- సీఎం రేవంత్​