రామకృష్ణాపూర్ ఓసీపీ రెండో ఫేజ్ కు పబ్లిక్ హియరింగ్

రామకృష్ణాపూర్ ఓసీపీ రెండో ఫేజ్ కు పబ్లిక్ హియరింగ్
  • నోటిఫికేషన్​ జారీ చేసిన స్టేట్ పొల్యూషన్ ​కంట్రోల్​ బోర్డు
  • డిసెంబర్ 3న ఆర్కేపీ ఓసీపీ ఆఫీస్​లో ప్రజాభిప్రాయ సేకరణ  

కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా పరిధి రామకృష్ణాపూర్​ సింగరేణి ఓపెన్​కాస్ట్​ మైన్​రెండో ఫేజ్ పర్యావరణ అనుమతి కోసం పబ్లిక్​ హియరింగ్​ నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ ​రీజియన్​ తెలంగాణ పొల్యూషన్​ కంట్రోల్​బోర్డు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటుకు నోటిఫికేషన్​ జారీ చేసింది. డిసెంబర్​3న ఉదయం10.30 గంటలకు రామకృష్ణాపూర్​ ఓసీపీ ప్రాజెక్ట్​ సమీపంలో పబ్లిక్ ​హియరింగ్​చేపట్టనున్నారు.  రెండో ఫేజ్​లో సేకరించనున్న అటవీ భూముల అనుమతికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాలతో సభను  నిర్వహించనున్నారు.  

రూ.442.90 కోట్లతో రెండోఫేజ్​ పనులు

 2013లో ఆర్కేపీ ఓసీపీ మైన్​ప్రారంభ సమయంలో ఎంకే4, 4ఏ గనులను సింగరేణి మూసివేసింది. అంతకుముందు మూతపడ్డ ఆర్కే-4 గనిలో మిగిలిన బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు రామకృష్ణాపూర్​గనిని చేపట్టింది. 2024 –-25 ఆర్థిక సంవత్సరం వరకు 1,60,19,293 టన్నుల బొగ్గును వెలికితీసింది. కాగా అక్కడ స్థలాలు లేకపోవడం, రెండోఫేజ్​స్థలాలకు పర్మిషన్​రాకపోవడంతో గత ఏప్రిల్​3న అధికారికంగా ఆర్కేపీ ఓసీపీని మూసివేసింది. అక్కడి ఉద్యోగులను ఇతర గనులకు బదిలీ చేసింది. రెండోఫేజ్​లో 1,209.24 హెక్టార్ల స్థలం అవసరమవగా, ఇందులో 597.45 హెక్టార్లు అటవీ భూమి,611.79 హెక్టార్లు ఇతర భూములు ఉన్నాయి.

 ఇవి  మూసివేసిన ఆర్కే1ఏ,ఆర్కే3,ఎం-4,ఆర్కే-4 బొగ్గు గనుల ప్రాంతంలో ఉండడంతో రెండో ఫేజ్​పర్మిషన్​ కోసం ఇప్పటికే సింగరేణి కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. పబ్లిక్​ హియరింగ్​ తర్వాత అటవీ భూములకు పర్మిషన్లు వస్తే  రూ.442.90 కోట్లతో మైనింగ్​కార్యకలాపాలు చేపడుతామని సింగరేణి పేర్కొంది. గనిలో బొగ్గు ఉత్పత్తి ఏటా 3.75 మిలియన్​టన్నుల చొప్పున 18ఏండ్ల పాటు బొగ్గు తవ్వకాలు చేపట్టనుంది. ఓసీపీ రెండో ఫేజ్​లో సేకరించే భూములు మందమర్రి, నస్పూర్​, మంచిర్యాల మండలాల పరిధిలోకి చెందినవి.