మెట్రో ఛార్జీల పెంపు ప్రతిపాదనపై జనం వ్యతిరేకత

మెట్రో ఛార్జీల పెంపు ప్రతిపాదనపై జనం వ్యతిరేకత
  • ఇప్పుడున్నవే చాలా ఎక్కువంటున్న ప్రయాణికులు
  • పెంపు ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత
  • మరో రెండు వారాల్లో పెరిగే అవకాశం
  • ఉన్న చార్జీలను రౌండ్ ​ఫిగర్​చేయనున్నట్లు సమాచారం

హైదరాబాద్, వెలుగు: మెట్రో చార్జీలను సవరించాలనే ప్రతిపాదనను ప్రయాణికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉన్న చార్జీలే ఎక్కువ అంటున్నారు. ఇప్పటికే బస్, ఎంఎంటీఎస్​ చార్జీలు పెంచారని, పెట్రోలు రేట్లు మండిపోతున్నాయని వాపోతున్నారు. ఈ టైంలో మెట్రో టికెట్ ​రేట్లు పెంచి తమపై భారం మోపొద్దని కోరుతున్నారు. మెట్రో రైల్​ చార్జీలు పెంచేందుకు అవకాశం ఇవ్వాలని హైదరాబాద్​ మెట్రో సంస్థ ఇటీవల కేంద్రాన్ని అభ్యర్థించగా, కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఈ నెల 15 వరకు మెయిల్ ద్వారా ప్రయాణికుల సలహాలు తీసుకుంటోంది. కాగా సిటీలో సాఫీగా, త్వరగా గమ్యస్థానానికి చేరాలంటే ఉన్న ఏకైక ఆప్షన్ మెట్రో రైలు. ప్రస్తుతం 3 కారిడార్ల పరిధిలో డైలీ 4 లక్షల మందికి పైగా జర్నీ చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రతి రైలు కిక్కిరిసి కనిపిస్తోంది.పెరిగిన ఆర్టీసీ బస్ ​చార్జీలు, ట్రాఫిక్ సమస్యతో ఎంతోమంది మెట్రోనే ఎక్కుతున్నారు. ఇప్పుడు వీటి చార్జీలు కూడా పెంచితే ఎలా అని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కమిటీ నిర్ణయంతోనే..

ప్రస్తుతం మెట్రో టిక్కెట్‌‌ ధర కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.60గా ఉంది. 2017 నవంబరు 28 నుంచి ఈ చార్జీలు అమలులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఎల్‌‌అండ్‌‌టీ, హైదరాబాద్‌‌ మెట్రో సంస్థ అమలు చేస్తోంది. మెట్రో రైలు చట్టం ప్రకారం మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్‌‌కు మొదటిసారి మాత్రమే చార్జీలు పెంచేందుకు అవకాశం ఉంటుంది. మరోసారి పెంచాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందే. మెట్రో సంస్థ ప్రతిపాదనతో కేంద్రం ఇటీవల ఫేర్‌‌ ఫిక్సేషన్‌‌ కమిటీని నియమించింది.కమిటీ సిఫార్సులతో చార్జీలు పెరగనున్నాయి. ఉన్నవాటిని రౌండ్ ఫిగర్ చేస్తారని తెలుస్తోంది.

15 లోపు అభిప్రాయాలు చెప్పొచ్చు

చార్జీల సవరణ కోసం కేంద్రం హెచ్ అండ్ వీ అడిషనల్ సెక్రెటరీ డా.సురేంద్రకుమార్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ సభ్యులుగా రిటైర్డ్ జస్టిస్ గుడిసేవ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన ఫేర్ 
ఫిక్సేషన్ కమిటీని నియమించింది.ఈ నెల 15లోపు ప్రయాణికులు తమ అభిప్రాయాలను, సలహాలను మెయిల్‌‌ ‘ffchmrl@gmail.com’ లేదా చైర్మన్‌‌, ఫేర్‌‌ ఫిక్సేషన్‌‌ కమిటీ, మెట్రో రైల్ భవన్‌‌, బేగంపేట, 500003 చిరునామాకు పోస్ట్ ద్వారా పంపొచ్చు.

పెంచితే పేదలు ఎక్కరు

చార్జీలు పెంచాలనే ఆలోచన కరెక్ట్ ​కాదు. పేద, మధ్య తరగతి వారికి మెట్రో జర్నీ భారం అవుతుంది. ఢిల్లీ మెట్రో చార్జీలు చాలా రీజనబుల్​గా, సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇక్కడ మెట్రో ప్రారంభించినప్పుడే ఎక్కువ చార్జీలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ పెంచుతామం టున్నారు. ఇప్పటికే బస్, ఎంఎంటీఎస్ చార్జీలు, పెట్రోల్​ రేట్లు పెరిగాయి. ఇలా పెంచుకుంటా పోతే ఎలా? రోజూ ప్రయాణించేవారిని దృష్టిలో పెట్టుకుని పెంచకూడదని కోరుతున్నాం. - ప్రశాంత్, మియాపూర్

ఉన్న చార్జీలనే కొనసాగించాలి

మూడేండ్లుగా ఆఫీసుకి మెట్రోలోనే వెళ్తున్నా. మెట్రో కార్డ్ కూడా తీసుకున్నా. డైలీ సికింద్రాబాద్ ఈస్ట్ నుంచి రాయదుర్గం వరకు వెళ్తున్నా. రానుపోనూ రూ.80 అవుతోంది. ఇప్పుడు చార్జీలు పెంచితే ఇబ్బంది అవుతుంది. చిరు ఉద్యోగులు, రోజువారీ పనులకు వెళ్లే ఎంతో మంది మెట్రోలోనే జర్నీ చేస్తున్నారు. అందరిని దృష్టిలో ఉంచుకుని తగ్గించడం లేదా ఉన్న చార్జీలనే కొనసాగించాలి.- కావ్య, సికింద్రాబాద్

డైలీ ప్యాసింజర్లకు భారమే 

డైలీ బేగంపేట నుంచి మాదాపూర్ వరకు మెట్రోలో జర్నీ చేస్తా. ప్రస్తుతం మెట్రో రైళ్లలో రష్​ ఎక్కువగా ఉంటోంది. అయినప్పటికీ త్వరగా చేరుకుంటామనే ఉద్దేశంతో మెట్రోలోనే ఆఫీసుకు వెళ్తున్నా. ట్రాఫిక్​లో గంటలు పడితే మెట్రోలో నిమిషాల్లో వెళ్లిపోతాం. కానీ టికెట్ చార్జీలు పెంచితే రోజూ వెళ్లేవారికి మెట్రో ప్రయాణం భారం అవుతుంది. ఫేర్​ ఫిక్సేషన్​కమిటీ దీని గురించి ఆలోచించాలి.‌‌‌‌ - సుప్రియ, బేగంపేట