2022–23లో పీఎస్​బీలకు రూ. లక్ష కోట్ల లాభం

2022–23లో పీఎస్​బీలకు రూ. లక్ష కోట్ల లాభం

న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకుల గల్లా పెట్టెలు కళకళలాడుతున్నాయి. మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తంలాభం రూ. లక్ష కోట్ల మార్కును అధిగమించింది, మార్కెట్ లీడర్ స్టేట్ బ్యాంక్​కు మొత్తం సంపాదనలో దాదాపు సగం వాటా ఉంది. 2017–18లో మొత్తం రూ. 85,390 కోట్ల నికర నష్టాన్ని మూటగట్టుకోగా, 2022–23లో వాటి లాభం రూ.1,04,649 కోట్లకు చేరుకుంది. పన్నెండు పీఎస్​​బీలు 2021–22లో ఆర్జించిన రూ. 66,539.98 కోట్లతో పోలిస్తే మొత్తం లాభంలో ఈసారి 57 శాతం వృద్ధిని సాధించాయి. శాతం పరంగా చూస్తే పూణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నికర లాభం అత్యధికంగా 126 శాతంతో రూ. 2,602 కోట్లకు పెరిగింది. యూకో బ్యాంక్​ లాభం 100 శాతం పెరుగుదలతో రూ. 1,862 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం 94 శాతం వృద్ధితో రూ. 14,110 కోట్లకు ఎగిసింది. ఎస్​బీఐ 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 50,232 కోట్ల లాభాన్ని నివేదించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 59 శాతం కంటే ఎక్కువ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ) మినహాయించి, ఇతర పీఎస్​​బీలు లాభాలను భారీగా పెంచుకున్నాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే పీఎన్​బీ వార్షిక నికర లాభం 2021–22లో రూ. 3,457 కోట్ల నుంచి మార్చి 2023తో ముగిసిన సంవత్సరంలో రూ. 2,507 కోట్లకు.. అంటే 27 శాతం తగ్గింది.

మేలు చేసిన సంస్కరణలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేపట్టిన కార్యక్రమాలు, సంస్కరణల వల్ల పీఎస్​బీల లాభాలు భారీగా పెరిగాయని బ్యాంకింగ్​ ఎక్స్​పర్టులు చెబుతుంటారు. వీటి లాభదాయకతను పెంచడానికి కేంద్రం ‘4ఆర్​’ వ్యూహాన్ని అమలు చేసింది. ఎన్​పీఏలను పారదర్శకంగా గుర్తించడం, రిజల్యూషన్  రికవరీ, పీఎస్​​బీలను రీక్యాపిటలైజ్ చేయడం, ఫైనాన్షియల్​ ఎకోసిస్టమ్​లో సంస్కరణల వల్ల లాభాలు పెరిగాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో అంటే  2016–17 నుంచి 2020–21 వరకు పీఎస్​​బీల రీక్యాపిటలైజేషన్​ కోసం​ ప్రభుత్వం రూ.3,10,997 కోట్లను సమకూర్చింది. గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల క్రెడిట్ క్రమశిక్షణ పెరిగింది. బాధ్యతాయుతంగా అప్పులు ఇవ్వడం మొదలయింది.