
- 7,500 పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తే వాడుకలో ఉన్నవి 2,250
- ఏజెన్సీలకు నిర్వహణను అప్పగించి పైసలు వృథా చేస్తున్న బల్దియా
- బయట కనిపించని మొబైల్ బయో టాయిలెట్లు
హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ భారత్ లో భాగంగా గ్రేటర్ పరిధిలో అన్ని చోట్లా బల్దియా పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేసింది. ఒక్కో దానికి రూ.3 లక్షలు ఖర్చు చేసి 7,500 టాయిలెట్లను నిర్మించింది. మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం గ్రేటర్‌లోని అన్ని జోన్లలో 5,295 టాయిలెట్లే మిగిలాయి. ఇందులో 2,250 మాత్రమే వాడకలో ఉన్నాయి. మిగతా వాటి మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో జనాలకు ఏమాత్రం ఉపయోగపడట్లేదు. కానీ మెయింటెనెన్స్ టెండర్ల దక్కించుకున్న ఏజెన్సీలు మాత్రం 5,036 టాయిలెట్లకు సంబంధించిన బిల్లులను పెడుతూ బల్దియా నిధులను దోచుకుంటున్నాయి.
కిలోమీటర్ల మేర కనిపించని టాయిలెట్లు
ప్రస్తుతం ఉన్న 5,295 టాయిలెట్లలో 5,036 టాయిలెట్ల మెయింటెనెన్స్‌ను జోనల్‌కమిషనర్లు ఏజెన్సీలకు అప్పగించారు. నిర్వహణ కోసం ఆయా ఏజెన్సీలకు ఏరియాని బట్టి జీహెచ్ఎంసీ ఒక్కో టాయిలెట్‌కు నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు చెల్లిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న టాయిలెట్ల నిర్వహణకు నెలకు రూ.2 కోట్లకుపై గానే ఖర్చు చేస్తున్నా.. వాటిలో సగం కూడా జనాలకు అందుబాటులో లేవు. మిగతావి యాడ్స్ పర్పస్‌లో ఏర్పాటు చేసినప్పటికీ అవి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
డ్యామేజ్అవడంతో వాటిని తొలగించారు. సిటీలో వివిధ పనుల కోసం నిత్యం రోడ్లపైకి లక్షలాది మంది వస్తుంటారు. వారి అవసరాలకు తగ్గట్లుగా మాత్రం పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులో లేవు. కమర్షియల్ ఏరియాల్లో ప్రతి ఒక కిలో మీటర్ కు, నార్మల్ ఏరియా అయితే 2 లేదా 3 కిలో మీటర్లుకు ఒక పబ్లిక్ టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ కిలోమీటర్ల మేర కూడా టాయిలెట్లు కనిపించడంలేదు. కొన్నిచోట్ల వాటి నిర్వహణ కోసం టెండర్ల సమయం గడిచినా రీ టెండర్లు వేయకుండా అలాగే కొనసాగిస్తున్నారు.
అవి పార్కింగ్‌కే పరిమితం
సిటీలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో టాయిలెట్ల ఇబ్బంది లేకుండా ఉండేందుకు మొబైల్ బయో టాయిలెట్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా మార్చి స్ర్తీలు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాటు చేసింది. ఇలా గ్రేటర్లో 30 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. కానీ ఈ టాయిలెట్లు ఎక్కడా కనిపించడం లేదు. మొదట బాగానే మెయింటెనెన్స్ చేసినప్పటికీ ప్రస్తుతం వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ప్రస్తుతం మొబైల్ టాయిలెట్లు బయటకే రావడం లేదు. సికింద్రాబాద్ జోన్ కు కేటాయించిన 5 మొబైల్
టాయిలెట్లలో నాలుగు ఇందిరా పార్కు పక్కన ఎన్టీఆర్ స్టేడియంలో పార్కింగ్ చేసి ఉంటున్నాయి. అంతటా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. పబ్లిక్ టాయిలెట్లతో పాటు, మొబైల్ టాయిలెట్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని జనం కోరుతున్నారు.
ఊసులేని క్యూఆర్‌కోడ్
ఏజెన్సీలకు అప్పగించిన టాయిలెట్లకు క్యూ ఆర్ కోడ్ కేటాయించారు. వాటిని శుభ్రపరిచే సమయంతో పాటు నిర్వహణపై ప్రజాభిప్రాయం సేకరించేందుకు వాటిని ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణను క్యూఆర్‌కోడ్ ద్వారా చెక్‌చేస్తామని, సరిగా క్లీన్ చేయకపోతే ఆయా ఏజెన్సీలకు ఫైన్లు వేస్తామని గతంలోనే హెచ్చరించిన అధికారులు వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదు. ఏ ఒక్క టాయిలెట్ వద్ద కూడా క్యూఆర్ కోడ్ కనిపించడంలేదు. చాలా చోట్ల తాళాలు వేసి ఉంటున్నాయి.