2024లో ప్రజలు వారికి లుకవుట్ నోటీస్ ఇస్తరు

2024లో ప్రజలు వారికి లుకవుట్ నోటీస్ ఇస్తరు

లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటునన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు సీబీఐ లుకౌట్‌ నోటీసులు జారీచేసింది. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆయనతో పాటు.. ఈ కేసులో సంబంధమున్నట్టుగా భావిస్తోన్న మరో 13మందికి కూడా సీబీఐ నోటీసులిచ్చింది. ఆప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో భారీఎత్తున అక్రమాలు చోటుసుకున్నాయనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నోటీసులపై తాజాగా మనీశ్ సిసోడియా స్పందించారు. ఏంటి మోడీ జీ ఈ జిమ్మిక్కు ? అంటూ ఆయన చురకలంటించారు. ఎవరిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేయాలా అని ప్రధాని ఆలోచిస్తూ కూర్చోవడం నిజంగా దురదృష్టకరమని సిసోడియా అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటికి పరిష్కారాలను కనుగొనే నాయకుడి కోసం నేడు దేశం ఎదురు చూస్తోందని తెలిపారు. 2024లో ప్రజలు వారికి 'లుక్ అవుట్ నోటీసు' ఇస్తారని సిసోడియా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

తనపై లుకవుట్ నోటీసు జారీ చేయడం అంటే దేశం విడిచి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయడమేనని..తాను అందుబాటులో లేనని ఈ నోటీసులు జారీ చేశారని సిసోడియా తెలిపారు. కానీ తాను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నానన్నారు. ఎక్కడికి రావాలో చెప్పండి అంటూ మోడీని లక్ష్యంగా చేసుకొని సిసోడియా కామెంట్స్ చేశారు. మీ దాడులన్నీ విఫలమయ్యాయన్న ఆయన... తనకు సంబంధించి చిన్న ఆధారాన్ని కూడా కనుగొనలేదని విమర్శించారు. కాగా ఈ కేసులో తనను రెండు, మూడు రోజుల్లో అరెస్టు చేయవచ్చని ఇటీవల సిసోడియా అన్న విషయం తెలిసిందే. 

ఎక్సైజ్ పాలసీలో అవినీతి కేసులో సిసోడియాను ఏ1(మొదటి నిందితుడు)గా చేర్చిన సీబీఐ... ఆయన ఇంటితో పాటు ఏడు రాష్ట్రాల్లోని అనేక చోట్ల దాదాపు 15 గంటల పాటు సోదాలు చేసింది. కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్ టాప్​లు స్వాధీనం చేసుకుంది. దీనిపై సిసోడియా మాట్లాడుతూ.. తానెలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎక్సైజ్ పాలసీ పూర్తిగా పారదర్శకంగా రూపొందించామన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీకి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​కు మధ్యే పోటీ ఉంటుందని మరోసారి చెప్పారు.