బాలికలపై లైంగిక వేధింపులను ఉపేక్షించకూడదు : పుల్లెల గోపీచంద్

బాలికలపై లైంగిక వేధింపులను ఉపేక్షించకూడదు : పుల్లెల గోపీచంద్

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్  స్పందించారు. బాలికలపై వేధింపులను ఉపేక్షించకూడదని అన్నారు. క్రీడల్లోకి ఆడపిల్లలు తక్కువగా వస్తున్నారని.. వేధిపులకు గురైతే తల్లిదండ్రులు పిల్లలను క్రీడలకు పంపరని గోపీచంద్ చెప్పారు.  క్రీడాకారిణులకు భద్రత కల్పించడం అత్యవసరమని గోపీచంద్ వివరించారు. 

ఓఎస్డీగా సుధాకర్ బాధ్యతలు

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీగా సుధాకర్ బాధ్యతలు చేపట్టారు. విద్యార్థినులపై లైంగిక ఆరోపణల క్రమంలో హరికృష్ణను సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆయన స్థానంలో  సుధాకర్  ను ప్రభుత్వం నియమించింది. గతంలో జిల్లా యువజన క్రీడా అధికారిగా సుధాకర్ పనిచేశారు.  ప్రస్తుతం జింఖానా గ్రౌండ్ లో ఆయన పనిచేస్తున్నారు.

ఏం జరిగిందంటే.. 

హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలు వివిధ ఆటల పోటీలకు సంబంధించి కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా బాలికలు ఆరోపిస్తున్నారు. సాయంత్రం ఆటవిడుపు పేరుతో బాలికలలో కొంతమందిని బయటకు తీసుకెళుతున్నాడని, అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తు్న్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. హరికృష్ణకు ఓ మహిళా ఉద్యోగితో సహా  మరో ముగ్గురు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. సదరు మహిళా ఉద్యోగితో ఓఎస్డీకి అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.