ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ పీటర్ గ్రీన్ (Peter Greene) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. "పల్ప్ ఫిక్షన్", "ది మాస్క్" వంటి చిత్రాల్లో విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు పీటర్. న్యూయార్క్ నగరంలోని లోయర్ ఈస్ట్ సైడ్‌లో ఆయన అపార్ట్‌మెంట్లో డిసెంబర్ 12, 2025న విగతజీవిగా పడి ఉన్నాడని ఆయన మేనేజర్ గ్రెగ్ ఎడ్వర్డ్స్ వెల్లడించాడు.
మొదట పక్కింటి వారు తలుపు తెరిచి చూసి, పీటర్ గ్రీన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి నటుడు పీటర్ గ్రీన్ గదిని చెక్ చేయగా ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు లభ్యం కాలేదని ప్రాథమికంగా పోలీసులు వెల్లడించారు. అయితే, దివంగత పీటర్ గ్రీన్ పక్కింటివారిలో ఒకరు మాట్లాడుతూ.. “పీటర్ ముఖంపై గాయాలు మరియు రక్తంతో తడిసిన నేలపై అతని పడి ఉన్నాడు. ముఖ్యంగా, నటుడి బాడీ పక్కన సంఘటన స్థలంలో అనుమానాస్పద చేతితో రాసిన మెమో కనుగొనబడింది” అని తెలిపారు.
ఈ క్రమంలో ఆ మెమోలో "నేను ఇప్పటికీ వెస్టీనే" అని ఉండగా, ఇది 1970లలో హెల్స్ కిచెన్‌లో చురుగ్గా ఉన్న ఐరిష్-అమెరికన్ ముఠాను సూచించే విధంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ.. హత్య జరిగిందనే అనుమానాలు పూర్తిగా లేవని, నటుడి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని వైద్య పరీక్షకులు నిర్ణయిస్తారని పోలీసులు తెలిపారు.
యాక్టర్ పీటర్ గ్రీన్.. ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్, యాక్టర్స్తో కలిసి వర్క్ చేశాడు. జిమ్ కారీ & కామెరాన్ డియాజ్‌లతో కలిసి తాను నటించిన "ది మాస్క్" మూవీలో గ్యాంగ్‌స్టర్ డోరియన్ టైరెల్‌గా గ్రీన్ నటన ఎవర్ గ్రీన్గా నిలిచింది. 1994లో వచ్చిన ‘పల్ప్ ఫిక్షన్’లో జెడ్ పాత్ర, ఆ తర్వాత వచ్చిన ‘ది యూజువల్ సస్పెక్ట్స్’, ‘ట్రైనింగ్ డే’ వంటి సినిమాల్లో విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టాడు.
ఈ ఘటనతో హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పీటర్ మృతిపట్ల సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
