పప్పు దినుసుల సాగుకు ప్రాధాన్యత..ఖరీఫ్ పంటలకు కలిసొచ్చిన వానలు

పప్పు దినుసుల సాగుకు ప్రాధాన్యత..ఖరీఫ్ పంటలకు కలిసొచ్చిన వానలు
  • 1.70 లక్షల ఎకరాల్లో పప్పు ధాన్యాల పంటలు
  • జోరందుకున్న  వానకాలం పంటలు

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో పప్పు దినుసుల సాగు ఆశాజనకంగా సాగుతోంది. ఖరీఫ్ సీజన్ మొదట్లో వర్షాలు అంతగా పడకపోవడంతో ఆందోళన చెందిన రైతులు పంటలను కాపాడుకునేందుకు నానా తండాలు పడ్డారు. ఆ తర్వాత క్రమంగా వానలు పడడంతో రైతులు ఎక్కువగా పప్పు ధాన్యాల పంటలపై దృష్టి పెట్టారు. కంది, సోయాబీన్, పెసర, మినుము పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్ లో  మొత్తం 3,25,713 హెక్టార్లలో వివిధ పంటలు వేసేందుకు వ్యవసాయ శాఖ అంచనాలు తయారు చేయగా అందులో దాదాపు 1,70 లక్షల ఎకరాల్లో పప్పు దినుసుల పంటలు పండిస్తున్నారు. 65 వేల ఎకరాల్లో సోయాబీన్, 70 వేల ఎకరాల్లో కంది, 14 వేల ఎకరాల్లో పెసర, 7,500 ఎకరాల్లో మినుము పంటలు వేశారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఆయా పంటలకు జీవం పోశాయి. 

 జహీరాబాద్ డివిజన్ లో..

జహీరాబాద్ డివిజన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని రైతులు ఎక్కువగా పప్పుదినుసుల పంటలను పండిస్తున్నారు. ఇక్కడ ప్రాజెక్టులు, చెరువులు పెద్దగా లేకపోవడంతో రైతులు వర్షాధార పంటలపై ఆధారపడుతారు. కానీ పొలాల్లో అధికంగా పెరిగిన కలుపు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కలుపును తొలగించేందుకు కూలీల కొరత ఏర్పడడంతో ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీలను తీసుకువచ్చి అధికంగా చెల్లిస్తున్నారు.

అందుబాటులో విత్తనాలు

పప్పు ధాన్యాల సాగుకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. నకిలీ విత్తనాల బెడద జిల్లాలో సమస్యగా మారడంతో వాటిని నివారించేందుకు టాస్క్ ఫోర్స్ బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉన్నాయి. ఫసల్ బీమా పథకాన్ని ఈ సీజన్ నుంచి అమలు చేయనున్నారు. మినుము, పెసర, సోయాబీన్, కంది, వేరుశెనగ పంటలకు, వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, ఆయిల్ పామ్, టమాట, బత్తాయి, మిరప, మామిడి పంటలకు బీమా వర్తించనుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడుల్లో నష్టం జరిగితే పక్షం రోజుల్లోనే రైతుకు పరిహారం 
అందిస్తారు.

ఈసారి మెరుగైన దిగుబడులు

పప్పు దినుసుల పంటలకు వాతావరణం అనుకూలంగా ఉంది. వీటి సాగుకోసం ఎప్పటికప్పుడు రైతుల్లో అవగాహన పెంచుతున్నాం. అందుకు తగ్గట్టు రైతులు ఆయా పంటలను పండించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సాగుకు సంబంధించి సలహాలు, సూచనలు అందిస్తున్నాం. ఈసారి పంట నష్టం లేకుండా మెరుగైన దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంది.     - భిక్షపతి, ఏడీఏ, వ్యవసాయ శాఖ