పుల్వామా అమరవీరుల భార్యల దీక్ష భగ్నం

పుల్వామా అమరవీరుల భార్యల దీక్ష భగ్నం

జైపూర్‌‌‌‌‌‌‌‌ : తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ పుల్వామా అమరవీరుల భార్యలు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వారిని బలవంతంగా హాస్పిటల్స్‌‌కు తరలించారు. 2019లో పుల్వామాలో టెర్రర్ దాడిలో చనిపోయిన ముగ్గురు సీఆర్‌‌‌‌పీఎఫ్ జవాన్ల భార్యలు.. ఫిబ్రవరి 28 నుంచి నిరసనలు తెలుపుతున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌‌‌‌లో కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఇంటి వద్ద బైఠాయించారు. సర్కారు స్పందించకపోవడంతో ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. కారుణ్య నియామకాల నిబంధనలు మార్చాలని, బంధువుల పిల్లలకూ అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తమ గ్రామాల్లో రోడ్లు వేయాలని, అమరుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వారి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు మహిళలను వారి ఇంటికి దగ్గర్లోని ఆసుపత్రులకు తీసుకెళ్లారు. మద్దతుగా వచ్చిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. మరోవైపు, బాధిత మహిళలను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎంపీ కిరోడి లాల్‌‌ మీనాను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తనను నిర్బంధించారని, కొట్టారని ఎంపీ ఆరోపించారు.

గోవింద్ గఢ్‌‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో కిరోడి లాల్‌‌ మీనా అడ్మిట్ అయ్యారు. ‘‘పోలీసులు నన్ను చంపేందుకు యత్నించారు. అమరుల భార్యలు, యువకులు, నిరుద్యోగులు, పేదల ఆశీర్వాదంతో బతికి బయటపడ్డా. పోలీసుల దాడిలో గాయపడ్డా. జైపూర్‌‌‌‌లోని సవాయ్ మన్ సింగ్ ఆస్పత్రిలో చేరమని రిఫర్ చేశారు” అని ఆయన ట్వీట్ చేశారు.