రైల్లో సీటు కోసం గొడవ.. మహిళల దాడిలో వ్యక్తి మృతి

రైల్లో సీటు కోసం గొడవ.. మహిళల దాడిలో వ్యక్తి మృతి

రైల్లో సీటు కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఏకంగా 12 మంది కలసి ఒక్క వ్యక్తిని చితకబాదడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లి చివరకు ప్రాణాలు విడిచాడు. షాకింగ్ విషయం ఏంటంటే దాడి చేసిన వారిలో ఏడుగురు మహిళలే. ముంబై-బీదర్ ఎక్స్‌ప్రెస్ లో ఈ దారుణం జరిగింది.

మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్‌ ప్రాంతానికి చెందిన సాగర్‌ మార్కాండ్‌(26), అతని భార్య జ్యోతి, రెండేళ్ల కూతురు,  తల్లితో కలసి స్వస్థలమైన కుర్ద్వాడికి బయల్దేరారు. బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కుటుంబంతో సహ పూణే రైల్వే స్టేషన్ కు చేరుకొని ముంబై ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. జనరల్‌ బోగీ కావడం, ప్రయాణికులతో రద్దీగా ఉండడంతో..  తన భార్య కూర్చోనేందుకు ఓ మహిళా ప్రయాణికురాలిని కొంత స్థలం(సీటు) ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే ఆ మహిళ సీటు ఇవ్వకపోగా..సాగర్ ను  అసభ్యపదజాలంతో దూషించింది.

ఈ క్రమంలో సాగర్, ఆమె మధ్య గొడవ చోటు చేసుకుంది. తీవ్రంగా దూషించిన ఆ మహిళకు మద్దతుగా సుమారు 12 మంది కలిసి అతనిపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తన భర్తను కాపాడమని సహాయం కోసం కేకలు వేసినా.. కంపార్ట్మెంట్లో ఎవరూ జోక్యం చేసుకోలేదు. దాడి జరిగిన కాసేపటికి సాగర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

రైలు దౌండ్ జంక్షన్ వద్ద ఆగిపోయినప్పుడు, జ్యోతి రైల్వే పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపింది. పోలీసులు వెంటనే సాగర్‌ను సమీప ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.ఈ సంఘటనకు సంబంధించి దౌండ్ జంక్షన్ వద్ద రైల్వే పోలీసులు ఏడుగురు మహిళలతో సహా 12 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన 12 మందిలో ఒకరు మైనర్. నిందితులందరిపై సెక్షన్ 302 (హత్య) మరియు ఐపిసి లోని ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు.