రేపు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ పెళ్లి

రేపు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ పెళ్లి

చండీగఢ్‌ : పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. సీఎం భగవంత్‌ మాన్‌ గురువారం (జులై 7న) పెళ్లి చేసుకోనున్నారు. డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ అనే మహిళతో రెండో వివాహం జరగనున్నది. చండీగఢ్‌లోని సీఎం భగవంత్ మాన్ సింగ్ నివాసంలో జరగనున్న పెళ్లి వేడుకకు ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరుకానున్నారు. అలాగే, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, పంజాబ్‌ కేబినెట్‌ మంత్రులు, మాన్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అత్యంత సన్నిహితులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరగనుంది. మరో పెళ్లి చేసుకోవాలని సీఎం భగవంత్ మాన్ సింగ్ ను ఆయన తల్లి, సోదరి కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యుల సూచనల మేరకు తెలిసిన డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను పంజాబ్ ముఖ్యమంత్రి పెళ్లి చేసుకోబోతున్నారు. 

సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌కు ఇది వరకు ఇందర్‌ప్రీత్ కౌర్‌తో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. 2014లో మాన్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే ఆరేళ్ల వివాహ బంధం తర్వాత మొదటి భార్య ఇందర్‌ ప్రీత్ కౌర్‌, భగవంత్ మాన్ సింగ్ విడిపోయారు. 

పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ అనూహ్యంగా విజయం సాధించింది. దీంతో భగవంత్‌ మాస్ సింగ్‌ కు ముఖ్యమంత్రి పగ్గాలను ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అప్పగించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి పలు సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు.