టాప్‌‌‌‌‌‌‌‌- 2 ప్లేస్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌.. ఇవాళ (మే 24) ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌తో పంజాబ్ కింగ్స్ ఢీ

టాప్‌‌‌‌‌‌‌‌- 2 ప్లేస్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌.. ఇవాళ (మే 24) ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌తో పంజాబ్ కింగ్స్ ఢీ

జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్ 11 ఏండ్ల తర్వాత తొలిసారి టాప్–-2 ప్లేస్‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టింది.  2014 తర్వాత మొదటిసారి ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న పంజాబ్ అదే ఊపుతో శనివారం జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ను ఓడించాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. ఢిల్లీపై గెలిస్తే పంజాబ్ టాప్‌‌‌‌‌‌‌‌–2 ప్లేస్‌‌‌‌‌‌‌‌తో నేరుగా క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌–‌‌‌‌‌‌‌‌ 1 ఆడే అవకాశాలు మెరుగవుతాయి. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలిచి విజయంతో టోర్నీని ముగించాలని భావిస్తోంది. 

వాస్తవానికి ఇరు జట్ల మధ్య ఈ నెల 8న ధర్మశాలలో జరగాల్సిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ 10.1 ఓవర్ల తర్వాత బ్లాక్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ వల్ల రద్దయింది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌కు స్వల్ప విరామం వచ్చిన తర్వాత ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను తిరిగి నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, పంజాబ్ చివరగా  2014లో లీగ్ టేబుల్‌‌‌‌‌‌‌‌లో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ చేరిన తర్వాత తిరిగి ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లోనే గొప్పగా అడుతోంది. ఇండియా–పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా లీగ్‌‌‌‌‌‌‌‌కు బ్రేక్‌‌‌‌‌‌‌‌ వచ్చిన తర్వాత  ఫారిన్ ప్లేయర్లు మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, కైల్ జెమీసన్‌‌‌‌‌‌‌‌ మూడు రోజుల కిందట పంజాబ్‌‌‌‌‌‌‌‌ జట్టులో చేరారు.

ఈ నలుగురూ టీమ్ సెలెక్షన్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండటం పంజాబ్ బలాన్ని మరింత పెంచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా అద్భుతంగా నడిపించడమే కాకుండా 12 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 435 రన్స్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌లో సెకండ్ టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడు. ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్ సింగ్ (458), ప్రియాంశ్ ఆర్య (356) కూడా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటుతుండగా.. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ సింగ్ (11 వికెట్లు), యుజ్వేంద్ర చహల్ (13 వికెట్లు) జట్టు విజయాల్లో కీలకంగా ఉన్నారు. ఇదే జోరును మిగిలిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ కొనసాగిస్తే పంజాబ్ టాప్‌‌‌‌‌‌‌‌–2తో నేరుగా క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1 ఆడటం పెద్ద కష్టమేం కాబోదు. 

మరోవైపు  బుధవారం ముంబై ఇండియన్స్ చేతిలో భారీ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ ఆరంభంలో అదరగొట్టినా తర్వాత ఆ టీమ్ డీలా పడింది.  పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో పెద్ద స్కోర్లు చేయలేకపోవడం, లీగ్‌‌‌‌‌‌‌‌కు బ్రేక్ వచ్చిన తర్వాత స్టార్​ పేసర్ మిచెల్ స్టార్క్ లేకపోవడం జట్టును దెబ్బతీశాయి. దాంతో చేజేతులా ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయిన ఢిల్లీ.. పంజాబ్‌‌‌‌పై గెలిచి ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ను సానుకూలంగా ముగించాలని ఆశిస్తోంది. కానీ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పంజాబ్‌‌‌‌‌‌‌‌ను  ఓడించడం అంత సులువు కాబోదు.