
- కార్తీక్.. కేక
- లాస్ట్ ఓవర్లో ఒక్క పరుగిచ్చి 2 వికెట్లతో మ్యాజిక్
- రాజస్తాన్ అనూహ్య విజయం
- రాణించిన యశస్వి, అర్షదీప్
దుబాయ్: ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో రాజస్తాన్ రాయల్స్ బోణీ కొట్టింది. విజయం ఖాయం అనుకున్న పోరులో పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా ఓడింది. లాస్ట్ ఓవర్లో ప్రత్యర్థికి 4 రన్స్ కావాల్సిన దశలో.. రాయల్స్ బౌలర్ కార్తీక్ త్యాగి (2/29) అద్భుతం చేశాడు. ఒక్క రన్ మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసి ఊహించని విజయాన్ని అందించాడు. దీంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్ 2 రన్స్ తేడాతో పంజాబ్‌కు షాకిచ్చింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 185 రన్స్‌కు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (36 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), మహిపాల్ లామ్రోర్ (17 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43) రాణించారు. అర్షదీప్ సింగ్ (5/32) చెలరేగాడు. తర్వాత పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 రన్స్ చేసి ఓడింది. మయాంక్ అగర్వాల్ (43 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 67), కెప్టెన్ కేఎల్ రాహుల్ (33 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49) పోరాటం వృథా అయింది. కార్తీక్‌కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆఖర్లో పంజాబ్ బోల్తా
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో మయాంక్, రాహుల్ ఫస్ట్ వికెట్‌కు 120 రన్స్ జోడించి గెలుపు బాట వేసినా చివర్లో పంజాబ్ బోల్తా కొట్టింది. ఓపెనర్లిద్దరూ స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడారు. రాయల్స్ పేలవ ఫీల్డింగ్ వీళ్లకు కలిసొచ్చింది. రాహుల్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను వదిలేశారు. వీటిని సద్వినియోగం చేసుకున్న పంజాబ్ కెప్టెన్ ధాటిగా ఆడాడు. రెండో ఎండ్‌లో మయాంక్ అగర్వాల్ కూడా నిలకడ చూపడంతో తొలి 10 ఓవర్లలోనే పంజాబ్ 106 రన్స్ చేసింది. అయితే ఎనిమిది బాల్స్ తేడాలో ఈ ఇద్దరు ఔట్‌కావడంతో స్కోరు 126/2గా మారింది. ఈ దశలో మార్‌క్రమ్ (26 నాటౌట్), పూరన్ (32) దూకుడుగా ఆడి మ్యాచ్‌ను గెలిపించినంత పని చేశారు. కానీ లాస్ట్ ఓవర్ మూడో బాల్‌కు పూరన్ ఔట్‌కావడంతో డ్రామా మొదలైంది. 3 బాల్స్‌లో 3 రన్స్ కావాల్సిన దశలో దీపక్ హుడా (0)ను ఔట్ చేసిన త్యాగి ఒక్క రన్ మాత్రమే ఇచ్చి రాజస్తాన్‌ను గెలిపించాడు.
అర్షదీప్ ‘పాంచ్’
ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్తాన్‌ను స్టార్టింగ్‌లో కట్టడి చేయలేకపోయిన పంజాబ్ బౌలర్లు.. ఆఖర్లో రిస్ట్రిక్ట్ చేశారు. కొత్త బాల్‌తో షమీ (3/21) ప్రభావం చూపగా, చివర్లో అర్షదీప్ సింగ్ కంప్లీట్‌గా డామినేట్ చేశాడు. అయితే ఫ్రెష్ వికెట్‌పై రాజస్తాన్‌కు ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (36), జైస్వాల్ ఫస్ట్ వికెట్‌కు 54 రన్స్ జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. అర్షదీప్ వేసిన ఆరో ఓవర్‌లో అగర్వాల్ క్యాచ్‌కు ఎవిన్ వెనుదిరిగాడు. దీంతో ఫస్ట్ వికెట్‌కు 54 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఏడో ఓవర్ (రషీద్)లో జైస్వాల్.. ఫోర్, సిక్స్‌తో రెచ్చిపోయినా.. తర్వాతి ఓవర్‌లో సంజూ శాంసన్ (4) ఔటయ్యాడు. ఈ దశలో వచ్చిన లివింగ్‌స్టోన్ (25) మంచి సహకారం అందించడంతో పవర్‌ప్లేలో57/1తో ఉన్న రాజస్తాన్ స్కోరు.. ఫస్ట్ టెన్‌లో 94/2కు చేరింది. 12వ ఓవర్‌లో ఫోర్, సిక్స్ కొట్టిన లివింగ్‌స్టోన్‌ను.. అలెన్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. మహిపాల్ వచ్చి రావడంతోనే.. 14వ ఓవర్‌లో లాస్ట్ రెండు బాల్స్‌ను భారీ సిక్సర్లుగా మలిచాడు. కానీ 15వ ఓవర్ సెకండ్ బాల్‌కు జైస్వాల్ హాఫ్ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. అయితే 16వ ఓవర్‌లో 6, 6, 4, 4తో 24 రన్స్ రాబట్టిన మహిపాల్.. 18వ ఓవర్‌లో అర్షదీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మధ్యలో రియాన్ పరాగ్ (4) కూడా ఔట్‌కావడంతో రాయల్స్ స్కోరు 169/6గా మారింది. లాస్ట్‌లో రాహుల్ తెవాటియా (2), క్రిస్ మోరిస్ (5), చేతన్ సకారియా (7), కార్తీక్ త్యాగి (1) సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్తాన్: 20 ఓవర్లలో 185 ఆలౌట్ (యశస్వి 49, మహిపాల్ 43, అర్షదీప్ సింగ్ 5/32, షమీ 3/21). పంజాబ్: 20 ఓవర్లలో 183/4 (మయాంక్ 67, రాహుల్ 49, త్యాగి 2/29).